ఏపీ విభజన జరిగాక తెలంగాణకు సీఎంగా కేసీఆర్, కొత్త ఏపీకి సీఎంగా చంద్రబాబు పగ్గాలు తీసుకున్నారు. అయితే రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు తెరపైకి వచ్చాయి. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలు సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుని రెండు రాష్ట్రాల అభివృద్ధికి దోహద పడతారని అంతా అనుకున్నారు.

 

కానీ అలా ఏమి జరగలేదు. పలు రాజకీయ కారణాల వల్ల చంద్రబాబు,కేసీఆర్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతి విషయంలోనూ వీరు జగడం పెట్టుకునే ఉన్నారు. ఆ జగడం వల్లే తెలంగాణలో కేసీఆర్ టీడీపీని క్లోజ్ చేసేసారు. తర్వాత కాంగ్రెస్ తో కలిసి టీఆర్ఎస్ ని ఓడిద్దామనే బాబు ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. పైగా రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి, ఏపీలో చంద్రబాబు ఓడిపోయేవరకు కేసీఆర్ నిద్రపోలేదు.

 

ఇక ఐదేళ్లలో ఇలా సాగిన వారి జగడం, ఏపీకి జగన్ సీఎం అయ్యాక ఆగింది. కేసీఆర్, జగన్ లు మంచి స్నేహపూర్వకంగా మెలుగుతూ, సమస్యలు పరిష్కారానికి ముందుకు కదిలారు. అంతా బాగుందనుకునే సమయంలో పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో తెచ్చింది. దీనిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీని వల్ల తెలంగాణకు నష్టమని చెబుతున్నారు. కానీ దీని వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని, సముద్రంలో కలిసే నీటినే వాడుకుంటామని ఏపీ చెబుతోంది.

 

అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం తగ్గకుండా పోరాటానికి సిద్ధమైంది. ఇక వీరి జగడం ఇలా జరుగుతుంటే ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు , ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో ని వ్యతిరేకించడం గానీ, సమర్ధించడం గానీ చేయలేదు. మిగతా అన్ని విషయాలపై జగన్ ప్రభుత్వంపై విమర్సలు చేస్తున్న బాబు, దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు.

 

ఒకవేళ కేసీఆర్ తో మళ్ళీ గొడవ ఎందుకు అనుకుంటున్నారో లేక..జగన్-కేసీఆర్ లు గొడవ పడితే చూడాలనుకుంటున్నారో తెలియడం లేదు. అయితే ఈయన ఇలాగే సైలెంట్ గా ఉంటే రివర్స్ లో టీడీపీకే ఇబ్బంది వచ్చేలా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం తెచ్చిన జీవోని సమర్ధిస్తున్నారా లేదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుపై ముందుకు వెళ్ళడానికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది. దీంతో రాయలసీమ వాసులు తర్వాత టీడీపీని ప్రశ్నిస్తే బాబుకు ఇబ్బందులు మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: