రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. కేంద్రం మంగళవారం నుంచి ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మే 22 నుంచి ప్రారంభమయ్యే ప్రయాణికుల కోసం వెయిటింగ్ లిస్టులు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. నిన్న రైల్వే శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. రేపటి నుంచి ప్రయాణికులు 22వ తేదీ తరువాత ప్రయాణం చేయాలనుకుంటే వెయిటింగ్ లిస్టు ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. 
 
అయితే రైల్వే శాఖ ఈ సంఖ్య పరిమితంగానే ఉంటుందని ప్రకటన చేసింది. ఏసి 3 టైర్‌కు 100, ఏసి 2 టైర్‌కు 50, స్లీపర్ క్లాస్‌కు 200, ఫస్ట్ ఏసి, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు 20 చొప్పున ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉండనుందని తెలుస్తోంది. ఈ పరిమితి తరువాత ప్రయాణికులకు బుకింగ్ యాక్సెప్ట్ కాదని రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లలో ఆర్‌ఏసీ ఉండదని గతంలోనే ప్రకటన చేసింది. 
 
ప్రయాణికులు రైల్వే శాఖ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే ప్రత్యేక రైళ్లలో టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ ఏజెంట్లు, రైల్వే ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రాలేదు. స్టేషన్లలో నేరుగా టికెట్లను విక్రయించే పద్ధతిని కూడా రైల్వే శాఖ ఇంకా ప్రారంభించలేదు. ప్రయాణికులు గరిష్టంగా ఏడు రోజుల వరకు మాత్రమే రిజర్వేషన్లు చేసుకునే అవకాశం ఉంటుంది. 
 
రైల్వే ప్రయాణికులు తప్పనిసరిగా పలు నిబంధనలు పాటించాలని రైల్వే శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. రైల్వే ప్రయాణికులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలి. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే అధికారులు వారిని అనుమతించరు. ప్రయాణికులకు రైల్వే శాఖ ఆహారం అందించనుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: