ఇప్పుడు క‌రోనా విస్తృతి నేప‌థ్యంలో అంద‌రి దృష్టి...ఈ వైర‌స్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి? అస‌లు ఎందుకు విస్తృతి జ‌రుగుతోంది అనే దానిపైనే ప‌డుతోంది. ఇలాంటి త‌రుణంలో తెలంగాణ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. వాస్త‌వ ప‌రిస్థితిని ఆయ‌న నిర్మోహ‌మాటంగా చెప్తున్నార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి గురించి మంత్రి స్పందిస్తూ, మొద‌ట విదేశాల నుంచి వ‌చ్చిన వారితో అనంత‌రం మ‌ర్క‌జ్ వెళ్లి వ‌చ్చి వారి వ‌ల్ల‌...ప్ర‌స్తుతం వ‌ల‌స కూలీల రూపంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

 

తెలంగాణ‌లో వైర‌స్ వ్యాప్తి జ‌ర‌గ‌కుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున వలస కార్మికులు, ఇతరులు వస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. మొదట విదేశాల నుంచి వచ్చినవారివల్ల, తర్వాత మర్కజ్‌తో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరిగిందని, ఇప్పుడు వలసకార్మికుల వల్ల ఆ ప్రమాదం ఉంద‌ని మంత్రి పేర్కొన్నారు. వివిధ రాష్ర్టాల నుంచి వస్తున్న వలస కార్మికుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉంటున్న కారణంగా.. వారి పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని ఆయ‌న తెలిపారు. ఇతర ప్రాంతాలనుంచి తెలంగాణకు వస్తున్న వారందరినీ ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉంచుతున్నట్టు మంత్రి స్ప‌ష్టం చేశారు. 

 

తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు వివిధ మార్గాల్లో 41,805 మంది వచ్చారని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. సడలింపులతో ఎక్కువ మంది బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని సూచించారు . కాగా, తెలంగాణకు ఇతర రాష్ర్టాల నుంచి వలస వస్తున్నవారితో కరోనా విస్తరిస్తున్నట్టు తెలుస్తున్నది. గత ఆరు రోజుల్లో ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వారిలో 35 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిపట్ల భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం వలసలు వస్తున్నవారిపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాల్లోకి ప్రవేశిస్తున్న కొత్తవారి వివరాలను నమోదు చేసుకొని, వారికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరిలోనైనా అనుమానిత లక్షణాలుంటే వెంటనే వారిని వైరస్‌ నిర్ధారణ కోసం ఆస్ప‌త్రికి తరలిస్తున్నారు. గత ఐదు రోజుల్లో ఆయా జిల్లాలనుంచి 66,959 మంది బయటకు వెళ్లగా, 41,805 మంది ప్రవేశించినట్టు ప్రత్యేక బృందాలు గుర్తించాయి. వలస వస్తున్నవారిని సరిహద్దుల్లోనే పరీక్షించి లక్షణాలున్నవారిని దవాఖానకు, లక్షణాలు లేనివారిని హోం లేదా ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: