ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం జగన్ సర్కార్ నెరవేరుస్తోంది. కరోనా విజృంభిస్తున్నా... లాక్ డౌన్ వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తినా ప్రభుత్వం సున్నా వడ్డీలను విడుదల చేస్తూ... అతి త్వరలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెబుతూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటోంది. 
 
తాజాగా జగన్ సర్కార్ డీఎస్సీ 2008 అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌నిచ్చేలా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీఎస్సీ- 2008 అభ్య‌ర్థుల‌కు క‌నీస టైం స్కేల్ ఇస్తూ తాత్కాలిక ఉద్యోగాలు ఇవ్వడానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. డీఎస్సీ 2008లో సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్ల పోస్టుల‌లో మొద‌ట డీఎడ్ వారికే ప్రభుత్వం అవ‌కాశం ఇచ్చింది. దీంతో బీఎడ్ విద్యార్థులు త‌మ‌కు కూడా అవ‌కాశం ఇవ్వాల‌ని కోర్టును ఆశ్రయించారు. 
 
కోర్టు డీఎడ్ వాళ్లకు 30 శాతం పోస్టులు కేటాయిస్తూ తీర్పు చెప్పింది. దీంతో మొద‌ట పోస్టులు వ‌చ్చిన డీఎడ్ అభ్య‌ర్థులు కోల్పోయారు. ప్రభుత్వం తాజాగా వారికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మూడు విడతల్లో ఉచిత బియ్యం, కంది బేడలు సరఫరా చేసిన జగన్ సర్కార్ తాజాగా 16వ తేదీ నుంచి ఉచిత బియ్యం, శనగల పంపిణీకి సిద్ధమైంది. 
 
ప్రభుత్వం రెడ్ జోన్లలో వాలంటీర్ల ద్వారా బియ్యం సరఫరా చేయనుందని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 2137కు చేరింది. రాష్ట్రంలో 1142 మంది డిశ్చార్జి కాగా 948 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 47 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: