కరోనా సృష్టించిన క‌ల‌క‌లం నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ గురించి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు మూడు లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలను అందజేయనున్నట్టు వివ‌రించారు. ఈపీఎఫ్‌ పరిధిలోకి వచ్చే ఎంఎస్‌ఎం ఈలకు 3 నెలలపాటు ప్రభుత్వమే ఈపీఎఫ్‌ చెల్లిస్తుంది. ఈ మేరకు రూ.2,500 కోట్లను కేటాయించింది. ఉద్యోగులు చెల్లించాల్సిన ఈపీఎఫ్‌ విరాళ మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు. 

 

అయితే, దీనిపై వివిధ వ‌ర్గాల స్పంద‌నపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ త‌రుణంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ త‌మ వైఖ‌రిని వెల్ల‌డించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ స‌న్నిహితుడనే పేరున్న మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్‌ కుమార్ స్పందించారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రకటించిన ఆర్థిక సాయం అమలుపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. పర్యవేక్షణ బాధ్యత కూడా రాష్ర్టాలకే ఉండాలని, ఓ ప్రత్యేక వ్యవస్థ ఉంటే పూర్తి సార్థకత చేకూరుతుందన్నారు. ఆరోగ్య రంగానికి తొలి ప్రాధాన్యత దక్కితే బాగుండేదని వినోద్ కుమార్ వెల్ల‌డించారు.

 

మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన పి.చిదంబరం ఈ ప్యాకేజీపై స్పందిస్తూ వలస కార్మికులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమ‌ని పేర్కొన్నారు. 45 లక్షల ఎంఎస్‌ఎంఈలకు మాత్రమే ఈ ప్యాకేజీ అనుకూలంగా ఉందని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఎంఎస్‌ఎంఈలకూ కొత్త రుణాలిస్తామనడాన్ని స్వాగతిస్తున్నామ‌ని తెలిపారు. ప్యాకేజీ ఒక ప్రహసనంలా ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వలస కార్మికులకు ఎలాంటి స్వస్థత చేకూర్చలేదని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: