ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని రైతుల ఖాతాలలో రేపు 5,500 రూపాయలు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రేపు ఖాతాలలో నగదు జమ చేయనున్నారు. రాష్ట్రంలోని 49 లక్షలకు పైగా రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. కరోనా కష్టకాలంలోనూ రైతు సంక్షేమమే ధ్యేయంగా జగన్ సర్కార్ పని చేస్తోంది. 
 
తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలోని రైతులకు లేఖ రాశారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా జగన్ సర్కార్ పని చేస్తోందని చెప్పారు. రైతు సంతోషమే రాష్ట్రం సంతోషమని... ఖరీఫ్ కు ముందే నగదు జమ చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని జగన్ తెలిపారు. రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు సీఎం తెలిపారు. 
 
మేనిఫెస్టోలో రైతు భరోసా పథకం ద్వారా 12,500 రూపాయల చొప్పున రైతులకు ఇస్తామని చెప్పామని... ప్రభుత్వం రైతు భరోసాను 13,500 రూపాయలకు పెంచి... ఐదేళ్లలో 67,500 రూపాయలు ప్రతి కుటుంబానికి భరోసా ఇస్తుందని అన్నారు. ప్రభుత్వం ఐదేళ్లలో 17,500 రూపాయలు అధికంగా ఇస్తోందని తెలిపారు. రైతు భరోసా సొమ్ము మొదటి విడతగా మే నెలలో 7,500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 
 
ఇప్పటికే ప్రభుత్వం గత నెలలో 2,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేసినందున ఈ నెలలో 5,500 రూపాయలు జమ చేయనుంది. ప్రభుత్వం రైతుల కోసం 3,675 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రభుత్వం జమ చేసిన నగదును బ్యాంకులు పాత బకాయి కింద జమ చేసుకున్నా, తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా రైతులు 1902 కు ఫోన్‌ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: