తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు క‌రోనా మ‌హ‌మ్మారి షాకుల‌మీద షాకులు ఇస్తోంది. త‌క్కువ‌గా అంచ‌నా వేసినందుకు అంతుచిక్క‌ని వేగంతో రెచ్చిపోతోంది. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌గ‌లిగామ‌ని.. మ‌రికొంత‌కాలం అప్ర‌మ‌త్తంగా ఉంటే.. ఇక మ‌నం గ‌డ్డ‌కు ప‌డ్డ‌ట్టేన‌ని సీఎం కేసీఆర్ అనేక‌మార్లు చెప్పారు. కానీ.. ఆయ‌న అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ.. వైర‌స్‌ మ‌రింత‌గా వ్యాప్తి చెందుతోంది. క‌రోనా విష‌యంలో ఇలా మూడునాలుగుసార్లు కేసీఆర్ అంచ‌నా త‌ప్పారు. నిజానికి.. అసంబ్లీ స‌మావేశాల్లో క‌రోనా మహ‌మ్మారి గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్ర‌స్తావించిన‌ప్పుడు కేసీఆర్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. త‌న‌దైన శైలిలో పంచ్‌లు విసిరారు.

 

అదేదో మందు పారాసెట‌మాల్ వేసుకుంటే స‌రిపోతుంద‌ని, అదిమ‌న‌ల్ని ఏమీ చేయ‌లేద‌ని, అవ‌స‌రం అయితే.. మాస్క్ లేకుండా కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ప‌నిచేస్తామ‌ని చెప్పారు. కానీ.. చూస్తుండ‌గానే.. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని చుట్టేసింది. తెలంగాణ‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. క‌రీంన‌గ‌ర్‌లో క‌ల‌క‌లం రేపింది. త‌బ్లిఘీ జమాత్ ఉదంతం ఊపిరాడ‌కుండా చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. మ‌ర‌ణించివారి మృతదేహాల‌కు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తే.. క‌రోనా ఉన్న‌ట్లు తేలిన విష‌యం తెలిసిందే. ఇలాంటి ఊహించ‌ని ఘ‌ట‌న‌లను కేసీఆర్ అంచ‌నా వేయ‌లేక‌పోయారు. ఈ క్ర‌మంలోనే వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన కేసీఆర్ క‌రోనా క‌ట్ట‌డికి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. క‌రీంన‌గ‌ర్ నుంచి వైర‌స్‌ను త‌రిమికొట్ట‌గ‌లిగారు.

 

హ‌మ్మ‌య్య.. ఇక మ‌నం బ‌య‌ట‌ప‌డిన‌ట్టేన‌ని అనుకుంటున్న త‌రుణంలోనే.. అనుకోని పిడుగుప‌డుతోంది. ఇప్పుడు హైద‌రాబాద్‌లో వైర‌స్ మ‌హ‌మ్మారి మ‌రింత‌గా రెచ్చిపోతోంది. ఊహ‌కంద‌ని విధంగా విస్త‌రిస్తోంది. ఇదే స‌మ‌యంలో వ‌ల‌స‌కార్మికుల రాక‌తో మ‌ళ్లీ రూర‌ల్‌లో కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇదిలా ఉండ‌గా..తాజాగా.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మ‌రో షాక్ త‌గిలింది. మృతదేహాలకు కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా.. గతంలో మృతదేహాల‌కు టెస్టులు చేయాలిసిన అవసరం లేదని తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టెస్ట్‌లు చేయకపోతే కేసులు థర్డ్ స్టేజీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. అంతేకాదు.. క‌ర్నూలు, మ‌రో జిల్లాలో మృతి చెందిన ఇద్ద‌రు డాక్ట‌ర్ల మృత‌దేహాల‌కు ప‌రీక్ష‌లు చేయ‌గా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిందన్న విష‌యాల‌ను  కోర్టుకు వినిపించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: