మనదేశంలో వైరస్‌ కంటికి కనిపించకుండా విధ్వంసం సృష్టిస్తోంది. సైలెంట్ గా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  మన దేశంలో అయితే ఇంకా ఏకంగా రెండు లక్షల పాజిటివ్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే టెస్టులు చేస్తే ఆ విషయం బహిర్గతమయ్యే అవకాశముందని వైద్య నిపుణులు బావిస్తున్నారు. వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తున్నట్టుందని వాపోతున్నారు. 

 

దేశంలో లాక్‌డౌన్‌ విధించి 50  రోజులు పూర్తయినా.. కరోనా కేసులు మాత్రం అస్సలు తగ్గుముఖం పట్టడం లేదు. పైగా రోజు రోజుకూ రికార్డు దిశగా నమోదవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను  బెంబేలెత్తిస్తున్నాయి. లాక్‌డౌన్‌ విధించి ఇన్ని రోజులైనా వైరస్‌ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు.. కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 70 వేలను దాటింది. ఇక కొత్త కేసులు మాత్రం రోజూ 3 వేలకు తక్కువగా ఉండటం లేదు. ఈ లెక్కలు చూస్తోంటే.. భారత్ స్టేజ్-3లోకి అంటే వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశలోకి ప్రవేశించిందేమోననే అనుమానాలు  బలపడుతున్నాయి. దీన్ని నిర్ధారించుకోడానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కమ్యూనిటీ ఆధారిత సర్వేను ప్రారంభించింది. 

 

దేశంలోని 21 రాష్ట్రాల నుంచి ర్యాండంగా ఎంపిక చేసుకున్న 69 జిల్లాల్లో దశలవారీగా సర్వే నిర్వహించనున్నట్లు ఐసీఎంఆర్ చెప్పింది. నిజానికి దేశంలో కరోనా వైరస్  సామూహిక వ్యాప్తి దశకు రాలేదని కేంద్రం, ఐసీఎంఆర్ బలంగా వాదిస్తూ వచ్చాయి, కానీ గడిచిన వారం రోజులుగా నమోదవుతోన్న నంబర్లు, పాజిటివ్ గా నిర్ధారణ అవుతోన్న  వాళ్లలో చాలా మందికి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం లాంటి పరిణామాలతో వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ ఎక్కడి నుంచో రావడం లేదని.. కమ్యూనిటీ ట్రాన్స్‌ మిషన్‌  దశలోకి ప్రవేశించి.. విజృంభిస్తోందని భావిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా.. కొవిడ్-19 కేసుల నమోదును బట్టి ఆయా జిల్లాల్లోని 10 క్లస్టర్ల నుంచి 400 మంది ర్యాండంగా ఎంపిక  చేసి యాంటీబాడీ ర్యాపిడ్ టెస్టులు చేపడతారు. అందరూ 18 ఏళ్లు పైబడిన మొత్తం 24వేల మందికి పరీక్షలు చేసి వైరస్ వ్యాప్తి తీరుపై ఒక అంచనాకు వస్తారు. పుణెలోని  నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తయారుచేసిన తొలి స్వదేశీ టెస్టింగ్ కిట్స్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇది కాకుండా కేంద్ర ఆరోగ్య శాఖ  నేతృత్వంలోని జనాభా ఆధారిత సెరో-సర్వే కూడా యధావిధిగా కొనసాగుతుందని ఐసిఎంఆర్‌ స్పష్టం చేసింది.

 

దేశంలోని రోగ విజ్ఞాన నిపుణుల అంచనా ప్రకారం.. కరోనా మూడో స్టేజ్‌కు వచ్చిందని..రాబోయే నెల నుంచి ఇండియాలో వైరస్‌ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని   అంటున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే చర్యలకు ఉపక్రమించాలని చెబుతున్నారు. కేసుల సంఖ్య 70 వేలే కదా అని కరోనాను చిన్న చూపు చూస్తే మాత్రం.. భవిష్యత్‌లో చాలా  ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: