కరోనా వేగంతో దేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయ్‌. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. టెస్టింగ్‌ సామర్ధ్యం పెరగడంతో పాటు వైరస్‌ సోకే వారి సంఖ్య కూడా పెరిగింది. వలస కార్మికుల రాకతో రాష్ట్రాల్లో కొత్త కేసులు రికార్డవుతున్నాయ్‌.

 

దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3 వేల 722 కొత్త కేసులు నమోదయ్యాయ్‌. 134 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు.  దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78 వేల 3కి చేరింది. ప్రస్తుతం 49 వేల 219 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 2 వేల 549కి పెరిగింది. 

 

వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు  సడలించడంతో వారంతా స్వస్థలాలకు చేరుకుంటున్నారు.  వలస కూలీలు సామాజిక దూరం పాటించకుండా లారీలు, ట్రక్కుల్లో పరిమితికి మించి ప్రయాణించడం కూడా కేసులు పెరగడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.

 

మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసులు అధికమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 14 వందల 95 కేసులు రికార్డయ్యాయ్‌. మరణాల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది. 

 

తమిళనాడులో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. కొత్తగా 509 మందికి వైరస్‌ సోకింది. రాజధాని చెన్నైలో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది.  టెస్టింగ్ సామర్ధ్యం పెరగడంతో పాటు వైరస్‌ సోకేవారి సంఖ్య కూడా పెరగడంతో కరోనా కేసులు రోజుల వ్యవధిలోనే రెట్టింపవుతున్నాయి.

 

ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో కరోనా కేసులు ఊహించని స్థాయిలో విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోంది. మొత్తానికి లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: