అంతా అనుకున్న‌ట్టు జ‌రిగితే.. క‌రోనా వైర‌స్ అదుపులోకి వ‌చ్చి లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే.. ఈ నెలాఖ‌రులోనే ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించే అవ‌కాశం క‌నిపిస్తోంది. నిజానికి.. క‌రోనా వైర‌స్ కార‌ణంగా మార్చిలోనే జ‌ర‌గాల్సిన బ‌డ్జెట్ స‌మావేశాలు వాయిదా ప‌డ్డాయి. దీంతో ఓటాన్ ఆకౌంట్ బ‌డ్జెట్ లాగా.. తాత్కాలిక బ‌డ్జెట్‌ను రూపొందించి ప్ర‌త్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్ర‌భుత్వం. అయితే.. లాక్‌డౌన్‌ను ఎత్తేసిన త‌ర్వాత పూర్తిస్థాయి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టేందుకు ఈనెలాఖ‌రులో అసంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు అంటున్నాయి.

 

ఇక ఇదే స‌మ‌యంలో మ‌రో ముచ్చ‌ట కూడా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల్లో బ‌డ్జెట్ స‌మావేశాల‌ను వాయిదా వేసేందుకు కూడా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌య‌త్నించినా ఆశ్చ‌ర్య‌మేమీ లేద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఓ కరోనా.. మ‌రోవైపు విశాఖ‌లోని ఎల్జీ పాలిమ‌ర్స్ గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న‌, అమ‌రావ‌తి భూముల అమ్మ‌కం వ్య‌వ‌హారం.. ఇవ‌న్నీ కూడా ప్ర‌భుత్వాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, దీని నుంచి త‌ప్పించుకునేందుకు బ‌డ్జెట్ స‌మావేశాల‌ను పూర్తిస్థాయిలో వాయిదా వేసే ఆలోచ‌న‌లో కూడా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు.. బ‌డ్జెట్ స‌మావేశాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టాల‌ని ప్ర‌తిప‌క్షాలు రెడీ అవుతున్నాయి.

 

క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లు ప‌డిన‌ క‌ష్టాల‌ను, విశాఖ గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న‌, అమ‌రావ‌తి భూముల అమ్మ‌కం, రైతుల ఆందోళ‌న‌లు.. రాజ‌ధాని త‌ర‌లింపు.. త‌దిత‌ర అంశాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీసి.. ప్ర‌జ‌ల్లో దోషిగా నిల‌బెట్టాల‌న్న క‌సితో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష టీడీపీ ఉంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌డుతున్నారు. ఇదే స‌మ‌యంలో అధికార వైసీపీ నేత‌లు కూడా చంద్ర‌బాబుకు గ‌ట్టిగానే స‌మాధానం చెబుతున్నారు. ప్ర‌ధానంగా వైసీపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి అయితే.. సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబును, ఆయన టీమ్‌ను ఏకిపారేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌రిగే బ‌డ్జెట్ స‌మావేశాల్లో ర‌చ్చ‌ర‌చ్చ కావ‌డం ఖాయ‌మ‌నేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: