మహారాష్ట్రలో కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం పాజిటివ్‌ కేసులు మహారాష్ట్రలోనే ఉండడం గమనార్హం. ఇక్కడ మరొక ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. సామాన్య జనంతోపాటు పోలీసులు, వైద్యులు, నర్సులు, జర్నలిస్టులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా పోలీసులు అత్యధిక శాతంగా ఉన్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1100 మంది పోలీసులు వైరస్ బారిన పడ్డారంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇందులో ఇప్ప‌టికే ముగ్గురు పోలీసులు కూడా మరణించారు. అయినా పోలీసులు ఆత్మ‌స్థైర్యం కోల్పోకుండా క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాడుతున్నారు. ప్రాణాల‌ను లెక్క చేయ‌కుండా విధుల్లో పాల్గొంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే లాక్‌డౌన్ అమ‌లులో రాత్రింబ‌వ‌ళ్లు విధుల్లో పాల్గొంటున్న పోలీసుల సేవ‌ల‌ను దేశంమొత్తం కొనియాడుతోంది. మరోవైపు పోలీస్ కుటుంబాలు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నాయి.

 

ఇక‌ పోలీసుల‌ తర్వాత 300 మంది వైద్యులు, నర్సులు వైరస్ బారిన పడ్డారు. దేశానికి వాణిజ్య రాజధానిగా ఉన్న ముంబైలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఈ నగరంలో ఉన్నటువంటి అత్యధిక జనసాంద్రత వల్లే వేగంగా వైర‌స్‌ వ్యాప్తి చెందుతోందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నగరంలోని ఒక్క ధారావిలోనే కేసులు వందల సంఖ్యలో నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పూట పూటకూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఫ‌లితం మాత్రం కనిపించడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింతగా పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 25,922 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. తమిళనాడులో 9,227, ఢిల్లీలో 7,798 కేసులు న‌మోదు అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 78810కు చేరుకుంది. 2,564 మంది మ‌ర‌ణించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: