దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినా గత మూడు రోజుల నుంచి అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న 41 కేసులు నమోదు కావడంతో 1367కు చేరింది. రాష్ట్రంలో 34 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. రాష్ట్రంలో మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
మరోవైపు మూడో విడత లాక్ డౌన్ మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో పలు రాష్ట్రాలు బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో బస్సుల గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజలకు ఆర్టీసీ బస్సుల గురించి స్పష్టత రాలేదు. అయితే తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణలోని అన్ని జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వచ్చిన తరువాతే ఆర్టీసీ సేవల ప్రారంభంపై ఆలోచిస్తామని చెప్పారు. 
 
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం తరువాత ఆర్టీసీ బస్సుల గురించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈరోజు మంత్రి పువ్వాడ ఖమ్మం జిల్లా అల్లిపురం కొనుగోలు కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించారు. కార్గో సేవలను వ్యవసాయం, మార్క్‌ఫెడ్‌లకు అనుసంధానం చేశామని మంత్రి అన్నారు. కార్గో ద్వారా మొక్కజొన్నను మార్క్‌ఫెడ్‌ గోదాంలకు తరలిస్తున్నామని అన్నారు. 
 
రేపు సీఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితం ప్రెస్ మీట్లో ప్రకటించిన విధంగానే రివ్యూ సమావేశం జరపనున్నారు. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్ పొడిగింపు లాంటి విషయాల గురించి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు రెడ్ జోన్లలో లాక్ డౌన్ సడలింపుల గురించి కూడా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.                           

మరింత సమాచారం తెలుసుకోండి: