కరోనా వైరస్‌ వ్యాప్తికి కార‌క దేశంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిందారోపణ‌లు ఎదుర్కుంటున్న చైనా నుంచి విదేశీ కంపెనీలు నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉన్నాయ‌నే వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. వైరస్‌ దెబ్బకు చైనా ఆర్థిక పునాదులు కదిలిపోతున్నాయి. అగ్రరాజ్యాల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్న వేళ.. కొత్త కుట్రలకు డ్రాగన్‌ తెర తీసింది. భారతీయ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురాశతో ముందుకు వ‌స్తోంది. ఇందులో భాగంగా ఊహించ‌ని కుట్ర‌ను అమ‌లు చేస్తోంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థల్లో చైనా స్థానం దాదాపు చివరే. సింగపూర్‌, మారిషస్‌, అమెరికా, నెదర్లాండ్స్‌, జపాన్‌ సంస్థలే తొలి ఐదు స్థానాల్లో నిలుస్తాయి. దీంతో సింగ‌పూర్ సంస్థ‌ల ద్వారా పెట్టుబడుల ప‌రంప‌ర కొన‌సాగిస్తోంది. 

 


భార‌త దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న షియామీ చైనాకు చెందిన సంస్థేనన్న విషయం తెలిసిందే. అయితే ఈ కంపెనీ సింగపూర్‌ ద్వారా భారత్‌లో రూ.3,500 కోట్ల పెట్టుబడిని పెట్టడం గమనార్హం. దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో ప్రస్తుతం సింగపూర్‌దే మొదటి స్థానం. చివరకు భారతీయ స్టార్టప్‌లైన ఉడాన్‌, డెల్హివరి, స్విగ్గీ, బిగ్‌ బాస్కెట్‌, బైజూస్‌, స్నాప్‌డీల్‌, ఓలా, ఓయో రూమ్స్‌, పేటీఎంల్లోనూ చైనా సంస్థలు టెన్సెంట్‌, అలీబాబా పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబ‌డుల వెనుక అస‌లు లెక్క చైనా ఎత్తుగ‌డ‌ల‌ని పేర్కొంటున్నారు. దేశీయ స్టార్టప్‌ల్లో చైనా సంస్థల పెట్టుబడుల విలువ ఎంతలేదన్నా 3.9 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుంది. ఇలా దొడ్డిదారిన హాంకాంగ్‌, సింగపూర్‌ దేశాల మీదుగా దేశంలోకి అడుగుపెట్టిన చైనా పెట్టుబడులు 4.2 బిలియన్‌ డాలర్ల దాకా ఉంటాయని సమాచారం. గత నెల హెచ్‌డీఎఫ్‌సీలో తమ వాటాను చైనా ఒక శాతానికి పెంచుకున్నది తెలిసిందే. దీంతో చైనా నుంచి వచ్చే కొత్త పెట్టుబడులకు అనుమతిని కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో భారత్‌కు చైనా పెట్టుబడులు హాంకాంగ్‌, సింగపూర్‌ల మీదుగా వస్తుండగా, చైనా దొంగ‌దెబ్బ‌ను ప‌సిగ‌ట్టి త‌గు రీతిలో స్పందించ‌క‌పోతే...భార‌త్ న‌ష్ట‌పోతుంద‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: