తెలంగాణలో ఇప్పుడప్పుడే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కే పరిస్థితి కన్పించడం లేదు . ఆర్టీసీ బస్సుల నిర్వహణపై ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఒక  స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఈ నెల 16 వతేదీ నుంచి బస్సులను నడపనుంది . అయితే తెలంగాణలో మాత్రం ఆర్టీసీ బస్సులను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సుముఖంగా ఉన్నట్లు కన్పించడం లేదు . ఆర్టీసీ బస్సుల నిర్వహణ పై  ఈ నెల 15 వ  తేదీ తరువాత సమీక్షించి ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే  ప్రకటించగా,  ఆర్టీసీ బస్సులు ఇప్పుడప్పుడే నడిపేది లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్ కుమార్ తెలిపారు .

 

తెలంగాణ లో అన్ని జిల్లాలు గ్రీన్ జోన్ లోకి వచ్చిన తరువాతే బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు . అయితే తెలంగాణ లో ప్రస్తుతం ఆరు జిల్లాలు రెడ్ జోన్ లో ఉండగా , హైదరాబాద్ లో రోజు, రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి . హైదరాబాద్ , రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉండడంతో , ఈ జిల్లాలు రెడ్ జోన్ పరిధి  లో ఉన్నాయి . దీనితో ఈ మూడు జిల్లాలు ఇప్పుడప్పుడే గ్రీన్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశాలేంత మాత్రం కన్పించడం లేదు .

 

తెలంగాణ లో  అన్ని జిల్లాలు గ్రీన్ జోన్ పరిధిలోకి వచ్చే వరకు ఆర్టీసీ బస్సులను రోడ్లపై తిప్పరాదని రాష్ట్ర ప్రభుత్వం కనుక  విధానపరమైన నిర్ణయం తీసుకుంటే , ఇప్పుడప్పుడే ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వచ్చే అవకాశం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు . ఇప్పటికే ప్రభుత్వ , ప్రైవేట్ కార్యాలయాలు ప్రారంభం కావడంతో ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: