దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య, కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా విజృంభణతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. లాక్ డౌన్ ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడింది. లాక్ డౌన్ వల్ల ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. 
 
తాజాగా ఒక ప్రముఖ సంస్థ జరిపిన సర్వేలో ప్రైవేట్ రంగ సంస్థల గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో మెజారిటీ ప్రైవేట్ సంస్థలు వేతనాల్లో కోత విధించేందుకు, ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయని తేలింది. దేశంలోని 68 శాతం సంస్థలు ఈ దిశగా ఆలోచిస్తున్నాయని సమాచారం. లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపడంతో ప్రైవేట్ రంగ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
సర్కారినౌకరి.ఇన్ఫో, మైహైరింగ్ క్లబ్.కామ్ సంస్థలు కలిసి ఈ సర్వేను చేపట్టాయి. దేశంలోని వివిధ రంగాలకు చెందిన 1,124 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. కొన్ని కంపెనీలు తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తుంటే... మరికొన్ని కంపెనీలు సీనియర్ ఉద్యోగులను సైతం తొలగించడానికి సిద్ధమవుతున్నాయి. కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ సంస్థలు తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగుల వేతనాల్లో కోతకు సిద్ధమవుతున్నాయి. 
 
లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ ప్రధానంగా తయారీ రంగాలు, ఆటోమొబైల్ పరిశ్రమలు, ఎఫ్.ఎం.సీ.జీ రంగాలపై ప్రభావం చూపిందని సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 78,000 దాటింది. 26,235 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 2,549 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలో నిన్న నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 2100కు చేరగా తెలంగాణలో 1414కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: