లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ వ్యూహంపై కసరత్తు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.  వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కంటైన్మెంట్  క్లస్టర్‌లపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. 

 

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 290 కంటైన్మెంట్ క్లస్టర్లకు గానూ 75 క్లస్టర్లలో 28 రోజులుగా ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అటువంటి వాటిని గుర్తించి అన్ని సాధారణ కార్యకలపాలకు అనుమతులివ్వాలని అధికారులను అదేశించారు సీఎం జగన్. కేసుల సంఖ్య, విస్తరణ అధికంగా ఉన్న 22 క్లస్టర్లలో 500 మీటర్లు కంటైన్‌మెంట్‌ ఏరియా, 500 మీటర్ల బఫర్‌ జోన్ కలుపుకొని 
కిలో మీటరు పరిధిలో కంటైన్‌మెంట్‌ ఆపరేషన్స్‌ నిర్వహించాలని ఆదేశించారు. ఆ ప్రాంతాల్లో ఆంక్షలు కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు.  

 

ముఖ్యమంత్రి ఆదేశాలతో.. పది కంటే తక్కువ కేసులు నమోదైన 103 క్లస్టర్లలో 200 మీటర్ల వరకు కంటైన్ మెంట్, 200 మీటర్ల బఫర్ ఏరియాల్లో అత్యవసర కార్యక్రమాలు కొనసాగనున్నాయి. 14 రోజుల పాటు కేసులు నమోదు కాని 90 డార్మెంట్ క్లస్టర్ల పరిధిలో పూర్తి కార్యక్రమాలు జరగనున్నాయి. కేసులు రాని జోన్లలో కూడా మే 31 తర్వాత కార్యకలాపాలకు అనుమతించనుంది ప్రభుత్వం.

 

లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్‌లో ముఖ్యంగా.. థియేటర్లు, రెస్టారెంట్లు, ప్రజారవాణ, విద్యాసంస్థలు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తున్నారో నిర్ధిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వలస కూలీల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని , వారికి భోజనం, మంచి నీరు సహా సదుపాయాలు కల్పించాలని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. 

 

రాష్ట్రంలో టెలీ మెడిసిన్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి పీహెచ్‌సీకి ఓ బైక్‌ను జులై 1 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 1,060.. 108, 104 అంబులెన్స్‌ వాహనాలు ప్రారంభిస్తున్నందున బైక్‌ సర్వీసులు కూడా ప్రారంభించాలన్నారు. టెలీ మెడిసిన్‌ ద్వారా ప్రిస్కిప్షన్‌ ప్రకారం మందులు డోర్‌డెలివరీ చేయడానికే బైక్‌లను వినియోగించాలని సూచించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: