ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భూముల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ పడింది.  విశాఖ, గుంటూరులో గుర్తించిన 9 స్థలాల విక్రయానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  పోలీసు, మునిసిపల్‌, కార్మిక, పరిశ్రమల శాఖలకు చెందిన భూములను తొలిదశలో వేలానికి పెట్టారు. ఈనెల 28 నుంచి మూడు రోజులపాటు  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  ఈ-ఆక్షన్‌ లో విక్రయించనున్నారు.

 

భూముల అమ్మకం ద్వారా కనీసం  300 కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలనేది ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే కరోనా కష్టాలు వెంటాడుతున్న సమయం లో ఆశించిన స్థాయిలో వేలంపాట సాగుతుందా? బిడ్డర్ల నుంచి పోటీ ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.   

 

ప్రభుత్వ పథకాలకు అవసరమైన నిధుల సమీకరణకు విలువైన ప్రభుత్వ భూములను అమ్మేందుకు సిద్ధమైంది ఏపీ సర్కారు.  మిషన్‌ బిల్డ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముందుగా అమ్మకానికి పనికొచ్చే భూములను జిల్లాల వారీగా గుర్తించారు.  ఆ  జాబితాను సీఎం నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఆమోదించింది.

 

 గుంటూరు నగరాల్లోని భూములను విక్రయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్‌బీసీసీ ఈ-ఆక్షన్‌ నోటీసు ఇచ్చింది. గుంటూరులో 1.72 ఎకరాల్లో విస్తరించి ఉన్న మార్కెట్‌ సెంటర్‌  అత్యంత విలువైన భూమి. దీని రిజర్వ్‌ ధర 67.36 కోట్లుగా నిర్ణయించారు. గుంటూరు నగరంలో అత్యంత కీలకమైన మూడు భూములను అమ్మకానికి పెట్టారు. వాటి విస్తీర్ణం 13.23 ఎకరాలు. వీటి అమ్మకం రిజర్వ్‌ ధర 159.73 కోట్లుగా ఖరారు చేశారు.  ఇందులో కార్మిక శాఖ భూమి కూడా ఉంది.

 

విశాఖలో ఆరు చోట్ల విలువైన భూములను అమ్మకానికి పెట్టారు. అగనంపూడి, చినగదిలి, ఫకీర్ తకియా పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన ఆస్ధులు వున్నాయి. వీటి రిజర్వ్‌ విలువ  48.98 కోట్లుగా నిర్ధారించారు. నగరంలోని చినగదిలిలో పోలీసు క్వార్టర్స్‌ ఉన్నాయి.  దీని రిజర్వ్‌ విలువ 16.64 కోట్లుగా ఖరారు చేశారు.

 

రెండు జిల్లాల్లో మొత్తం  18.8 ఎకరాల భూముల రిజర్వ్‌ విలువ  208.62 కోట్లుగా నిర్ధారించారు. అంతకంటే తక్కువకు వేలం అనుమతించరు. వీడియో కాన్ఫరెన్స్‌ ఈ -వేలంపై ఈ నెల20 నుంచి 25 వరకు ట్రయల్స్‌ నిర్వహిస్తారు. బిడ్డర్స్‌ కోసం 26న వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. భూములు కొనుగోలు చేసిన వారు పూర్తిస్థాయిలో ఫీజు చెల్లించిన తర్వాతే సేల్‌డీడ్స్‌ వారి పేరిట విడుదల చేస్తారు. భూములను కొనుగోలు చేసేవారు 3 నెలల వ్యవధిలో పూర్తిడబ్బు చెల్లించాలి. ఆ తర్వాతే వారికి పూర్తి భూమి హక్కులు ఇస్తారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: