ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతుందనుకుంటున్న తరుణంలోనే మళ్లీ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, యాత్రికులు ఏపీకి వస్తున్నారు. వీరందరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉంచి, వారికి క‌రోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండ‌డంతో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీలో కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే చెన్నై కోయంబేడు మార్కెట్‌తో లింక్ ఉన్న కేసులు కూడా అధికంగానే ఉన్నాయి. ప్రధానంగా చిత్తూరు తదితర జిల్లాల‌కు చెందిన వారు కోయంబేడు మార్కెట్‌కు రాకపోకలు సాగిస్తూ ఉండడంతో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి సరికొత్త వ్యూహం రూపొందించేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వలస కార్మికుల రాక లేనప్పుడు ఏపీలో వైరస్ వ్యాప్తి దాదాపుగా అదుపులోనే ఉంది.

 

ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు కూలీలు వస్తుండడంతో మరింత పకడ్బందీగా కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే సమీక్ష నిర్వహించి అందుకు తగ్గట్టుగా కార్యాచ‌ర‌ణ‌ను చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో శుక్రవారం తాజాగా మరో 57 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2157కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అనంతపురం 4, చిత్తూరు 14, కడప 2, కృష్ణా 9, కర్నూలు 8,నెల్లూరు 14, విజయనగరం 3, విశాఖపట్నం 2, తూర్పు గోదావరి 1 ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని 1252 మంది డిశ్చార్జ్‌ కాగా, 48 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 857కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 60 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,038 సాంపిల్స్ ని పరీక్షించగా 102 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. అయితే.. వీటిలో 45 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారికి చెందిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. మహారాష్ట్ర నుంచి వ‌చ్చిన వారిలో 34, రాజస్థాన్ నుంచి వ‌చ్చిన వారిలో 11మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: