తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 ప్రైవేట్ ల్యాబ్స్‌లో కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఐసిఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఇందులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్స్, హిమాయత్ నగర్ లోని విజయ డయాగ్నస్టిక్స్ సెంటర్ చెర్లపల్లి లోని వింటా ల్యాబ్స్, సికింద్రాబాద్ బోయిన‌ప‌ల్లిలోని ఆపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్ లాబరేటరీ, పంజాగుట్టలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మ‌రికొన్ని ల్యాబ్‌లు ఉన్నాయి. అయితే ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ప్రైవేట్ ల్యాబ్‌ల‌లో వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయడం వలన గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని, నిర్వాహకులు సరైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించే అవకాశం ఉండదని, అంతేకాకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా డాక్టర్లతో కుమ్మక్కై రహస్యంగా ఇంటికే పరిమితం అయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాబ్‌ల‌కు అనుమతి ఇవ్వలేదు.

 

కేవలం ప్రభుత్వం పరిధిలో ఉన్న ల్యాబ్‌ల‌లో మాత్రమే క‌రోనా వైర‌స్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం వెలుగు చూస్తోంది. ఐసిఎంఆర్ అనుమతి ఇచ్చిన ప‌లు ప్రైవేట్‌ ల్యాబ్‌ల‌లోనూ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఈ ల్యాబ్‌ల‌లో నిర్వాహకులు ఈ తతంగం నడిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి మాత్రమే పరీక్షలు చేశామని ప‌లు ల్యాబ్‌ల‌ నిర్వాహకులు చెబుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాబ్‌ల‌లో ఎవరికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు..? వారు ఎక్కడి నుండి వచ్చారు..? పరీక్షల అనంతరం వారు ఎక్కడికి వెళ్లారు..? ఇందులో పాజిటివ్ వచ్చిన వాళ్లు ఎంతమంది ఉన్నారు..? అన్న విషయాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రభుత్వ ప్రయోగశాలలలో గాంధీ హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఫీవర్ హాస్పిటల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ప్రివెంటివ్ మెడిసిన్ నారాయణగూడ, నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉన్నాయి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: