కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో మానవాళి విలవిలలాడుతోంది. ఈ దేశం ఆ దేశం అని కాదు.. అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ వైరస్ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సమయంలో ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు, అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. అయితే ఇందులోనూ కొందరు తమ అక్రమ బుద్ధిని చూపించుకుంటున్నార‌న‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి గ్రామాలు, పట్టణాల్లో రోడ్లపై, డ్రైనేజీ కాలువ‌ల్లో బ్లీచింగ్ పౌడర్‌ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం బ్లీచింగ్ పౌడర్‌కు బదులుగా సున్నం వాడుతున్నారన్న విషయం వెలుగులోకి రావడంతో కలకలం రేగుతోంది.

 

అయితే ఈ విషయం ఎలా బయటకు వచ్చిందో చూద్దాం.. కాకినాడలో వాడుతున్న బ్లీచింగ్ పౌడర్ పై అక్కడి అధికారులకు అనుమానం వచ్చింది. బ్లీచింగ్ పౌడర్‌లో నాణ్యత లేదని, దీనిని ఒకసారి పరిశీలించాలని కాకినాడ అధికారులు గుంటూరు జిల్లా అధికారులకు చెప్పారు. ఎందుకంటే ఈ బ్లీచింగ్ పౌడర్ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల‌ నుంచి వివిధ‌ జిల్లాలకు సరఫరా అవుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన గుంటూరు జిల్లా అధికారులు వివరాలు సేకరించారు. అసలు పిడుగురాళ్లలో బ్లీచింగ్ పౌడర్ తయారయ్యే కంపెనీ లేదని తేలింది. పిడుగురాళ్లలో కేవలం సున్నం, ఇత‌ర‌ బట్టీలు మాత్రమే ఉంటాయని, అక్కడ ఎలాంటి బ్లీచింగ్ పౌడర్ తయారు కాద‌న్న విష‌యాన్ని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే.. సుమారు రూ.70 కోట్ల విలువైన బ్లీచింగ్ పౌడర్ అసలు ఎక్కడి నుండి వస్తోంది..? దీని వెనుక ఉన్నది ఎవరు..? అన్న విషయాలపై ఉన్నతాధికారులు ఆరాతీస్తున్నారు.

 

ఒకవేళ  నిజంగానే బ్లీచింగ్ పౌడర్ బదులు సున్నం వాడుతున్నట్టు తేలితే ఏపీలో కరోనా కుంభకోణం కలకలం రేపడం ఖాయమని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన ఇతర పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్లీచింగ్ పౌడర్‌కు బదులు సున్నం వాడుతున్నట్లు నిర్ధారణ అయితే మాత్రం జగన్ సర్కార్ కు చిక్కులు తప్పవని విశ్లేష‌కులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: