హైదరాబాద్ నగరంలో చిరుత కలకలం రేపుతోంది. మూడు శాఖల అధికారులకు గాయపడిన చిరుత పులి చుక్కలు చూపిస్తోంది. పోలీస్, అటవీ, జూ పార్క్ సిబ్బందికి ముచ్చెమటలు పట్టిస్తోన్న చిరుత నగరవాసులను భయాందోళనకు గురి చేస్తోంది. గత 36 గంటలుగా అధికారులు చిరుత కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దాని జాడ మాత్రం దొరకట్లేదు. నిన్న ప్రధాన రహదారి నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోతున్న చిరుతను చూసేందుకు యత్నించిన ఓ లారీ డ్రైవర్ పై చిరుత దాడి చేసింది. 
 
చిరుతను బంధించిన అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, అటవీశాఖ అధికారులు పులి ఎక్కడుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు చిరుత పులి గురించి రకరకాల వార్తలు వినిపిస్తూ ఉండటంతో ప్రజల్లో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. అటవీశాఖ అధికారులు పులిని బంధించటానికి 4 బోన్లను ఏర్పాటు చేశారు. అడుగులు దొరికాయని కాసేపు... ఫాం హౌస్ లో ఉందని కాసేపు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
దాదాపు 160 మంది నిన్నటి నుంచి నిద్రాహారాలు మాని చిరుత వేటలో పడ్డారు. చిరుత జాడ కోసం 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఒక్క కెమెరాలోను చిరుత ఆచూకీ కనబడలేదు. అధికారులు పులి కోసం 22 కుక్కలను అడవిలోకి వదిలారు. ఆరు మేకలను, 10 కేజీల పచ్చి మాంసాన్ని ఎరగా వేయటంతో పాటు పలు చోట్ల నీళ్లను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో చిరుత ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. 
 
చిరుత హిమాయత్ నగర్ వైపు వెళ్లిందని కొందరు... కల్వకుర్తి వైపు వెళ్లిందని మరికొందరు చెబుతూ ఉండటంతో ఆ ప్రాంత వాసులకు నిద్ర కరువైంది. టేదాన్, బుద్వేల్ వాసులు జాగ్రత్తగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. గురువారం(మే 14,2020) ఉదయం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి కాటేదాన్‌ అండర్‌ బ్రిడ్జి రోడ్డుపై స్థానికులు పులిని చూశారు. ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఓవైపు కరోనా మహమ్మారితో వణికిపోతున్న నగర శివారు ప్రజలకు చిరుత కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: