పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు , ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం  బ్యాక్ వాటర్ తరలించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని  ఆంధ్రప్రదేశ్ కమలనాథులు  స్వాగతిస్తుండగా , తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ బీజేపీ నాయకత్వం డిమాండ్ చేస్తోంది . ఈ మేరకు ఇప్పటికే ఒకరోజు నిరసన దీక్ష కూడా చేపట్టింది .

 

తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ ను ఇరకాటంలోకి నెట్టాలని భావిస్తోన్న బీజేపీ నేతలకు  , ఏపీ ప్రాంత బీజేపీ నేతల వ్యవహారశైలి తలనొప్పులు తెచ్చిపెడుతోంది .    పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపు పై ,  ఏపీలోని విపక్షాలు తమ  వైఖరిని స్పష్టం చేయకముందే ,  రాయలసీమ ప్రాంతానికి  చెందిన  బీజేపీ  నేత విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ విధాన నిర్ణయం కంటేముందుగానే, జగన్ ప్రభుత్వ నిర్ణయానికి జైకొట్టారు . అన్ని రాజకీయపార్టీలు ఈ నిర్ణయాన్ని సమర్ధించాలని ఆయన  డిమాండ్ చేస్తున్నారు . విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటన తరువాత రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా చేసేదిలేక  ప్రభుత్వ నిర్ణయానికి దన్నుగా నిలువాలని నిర్ణయించినట్లు స్పష్టం అవుతోంది  .  

 

 పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం పెంపును తెలంగాణలో  ఒక్క బీజేపీనే కాకుండా , మిగతా  రాజకీయ పక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి . ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని   రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కృష్ణానదీ యాజమాన్య బోర్డు , అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లి , అడ్డుకోవాలని ఫిర్యాదు చేసింది. అయితే తెలంగాణ లో టీఆరెస్ నాయకత్వాన్ని  ఆత్మరక్షణ లోకి నెట్టాలని పోతిరెడ్డిపాడు వ్యవహారంపై దూకుడుగా వ్యవహరించిన కమలదళం ,  తమ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించలేక , విభేదించలేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: