క‌రోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా విధించిన మూడో విడుత లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియబోతోంది. లాక్‌డౌన్‌ 4.0 ఉంటుందా? ఉంటే ఎలాంటి మార్గ‌ద‌ర్శ‌కాలు ఉంటాయి? అనే ఆస‌క్తి, ఉత్కంఠ స‌ర్వత్రా వ్య‌క్త‌మ‌వుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. కొత్త నిబంధనలతో లాక్‌డౌన్‌ 4.0 పూర్తిగా భిన్నంగా ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. భవిష్యత్‌ కార్యాచరణకు సంబంధించి శుక్రవారంలోగా అభిప్రాయాలు తెలుపాలని రాష్ర్టాలను కోరారు. రాష్ట్రాల వైపు నుంచి వివిధ ర‌కాల ప్ర‌తిపాద‌న‌లు, వారి వారి సొంత నిర్ణ‌యాలు వెలువ‌డుతున్న త‌రుణంలో కఠిన ఆంక్షల సడలింపుపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది.

 

ప్ర‌ధాన‌మంత్రి సూచ‌న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు త‌మ అభిప్రాయాలు వెల్ల‌డించారు. ఏపీ, ఢిల్లీ, కేరళ, కర్ణాటక రాష్ర్టాలు ఆర్థిక కార్యకలాపాలకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాయి. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లోపారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలతోపాటు దేశీయ విమాన సర్వీసులు, మెట్రో రైలు సర్వీసులు, హోటళ్లును పునఃప్రారంభించాలని కేరళ విజ్ఞప్తి చేస్తోంది. తమ రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు మిజోరం శుక్రవారం ప్రకటించింది. మరోవైపు, బీహార్‌ కూడా మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని కేంద్రాన్ని కోరింది. బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా రాష్ర్టాలు మాత్రం లాక్‌డౌన్‌ అమలుచేయాలని కోరుతున్నాయి. ఈ రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వలసకూలీల రాకతో ఇవి మరింతే పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు. వచ్చే కొన్ని నెలలపాటు రాష్ట్ర సరిహద్దులు తెరువొద్దని (వలస కూలీలు, అత్యవసరాలకు మినహా) ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ ప్రధానిని కోరారు. 

 

మ‌రోవైపు, కేంద్రం రాష్ట్రాల ప్ర‌తిపాద‌న‌ల‌ను గ‌మ‌నిస్తోంద‌ని కేంద్ర అధికారి ఒక‌రు తెలిపారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని ఏ రాష్ట్రం కూడా కోరలేదని, దశలవారీగా ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభించాలని అన్ని రాష్ర్టాలు కోరినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. లాక్‌డౌన్‌ 4.0లో ఎక్కువ సడలింపులు, సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. గ్రీన్‌జోన్లలో పూర్తిగా ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు పేర్కొన్నారు. ఆరెంజ్‌ జోన్‌లో పరిమితస్థాయిలో ఆంక్షలు ఉంటాయని, కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రమే కఠిన నిబంధనలు ఉండనున్నాయని వివరించారు. కాగా, దాదాపుగా నేడు లేదంటే ఆదివారం ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: