గత కొన్ని రోజుల నుంచి ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో తాజాగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 203 జీవోపై అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టేందుకు ఇచ్చిన జీవో గురించి వివరణ కోరింది. జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ను ప్రభుత్వ ఉద్దేశం తెలియజేయాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశించింది. 
 
ఈ వివాదం కొనసాగుతున్న తరుణంలోనే తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. రాయలసీమలోని కర్నూలు జిల్లా గుండ్రేవుల దగ్గర తుంగభద్ర నదిలో ఇసుకను తవ్వేందుకు వెళ్లిన ఏపీ వాహనాలను తెలంగాణ అధికారులు సీజ్ చేశారు. ఏపీ మైనింగ్ శాఖ అధికారులు ఏపీ వాహనాలను తెలంగాణ అధికారులు సీజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మైనింగ్ శాఖ అధికారులు తమ ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరిగాయని చెబుతున్నారు. 
 
దీంతో ఇరు రాష్ట్రాల అధికారులు ప్రస్తుతం అంతర్రాష్ట్ర సరిహద్దులు గుర్తించే పనిలో పడ్డారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ కేసీఆర్ ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటున్నారు. కానీ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ విస్తరణ గురించి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వివాదం మొదలైంది. ఏపీ సర్కార్ శ్రీశైలం నీటిని మళ్లించేలా ఎత్తిపోతల పథకం చేపట్టడంతో పాటు కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా పనులు చేపట్టడానికి జీవో జారీ చేసింది. 
 
తెలంగాణ సర్కార్ ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని కోరింది. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు తీవ్ర నష్టమని ఆ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు తలెత్తాయి. పోతిరెడ్డిపాడు జల వివాదం గురించి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: