దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో నిన్న 57 కొత్త కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 2,157కు చేరింది. ఇప్పటివరకు 48 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
లాక్ డౌన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాలు మూతబడ్డాయి. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల మూతబడిన ఆలయాలను తెరిచేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తుల భద్రత లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి దేవాదాయ శాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. అన్ని ప్రధాన ఆలయ ఈవోలకు ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
దేవాదాయ శాఖ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకునే ముందు భక్తులు ఆన్ లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించింది. భక్తులు 24 గంటల ముందే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన ఆలయాలలో దర్శనానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు. మాస్క్ ధరించిన భక్తులను మాత్రమే ఆలయాలలోకి అనుమతించనున్నారు. 
 
అంతరాలయ దర్శనానికి మాత్రం అనుమతులు ఉండవని తెలుస్తోంది. భక్తులు హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలుస్తోంది. తాత్కాలికంగా శఠగోపం, తీర్థం పంపిణీపై దేవాదాయ శాఖ నిషేధం విధించింది. గుడి పరిసరాలను, క్యూ లైన్లను సోడియం హైపోక్లోరైడ్‌తో స్ప్రే ఆలయ ఈవోలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆలయాలు తెరచుకోనున్నాయని సమాచారం.                     

మరింత సమాచారం తెలుసుకోండి: