అంచ‌నాలే నిజం అవుతున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేపథ్యంలో అనేక దేశాల సంస్థలు చైనా నుంచి బయటకు రావాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారతీయ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్‌ చైనాకు గుడ్‌బై చెప్తున్నది. చైనాలోని తమ కార్యకలాపాలను భారత్‌కు మార్చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. వచ్చే ఐదేండ్లలో ఇక్కడ రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే, ఇదే స‌మ‌యంలో స‌రిహ‌ద్దుల్లో చైనా ఊహించ‌ని కుట్ర‌కు తెర‌లేపుతోంది. తమ దేశం నుంచి భారత్‌, ఇతర సరిహద్దు దేశాలకు వెళ్తున్న సంస్థలను అడ్డుకునేందుకు చైనా కుట్రలకు తెరతీసింది. దేశ సరిహద్దుల్లో సైన్యం ద్వారా దాడులు, దురాక్రమణలకు తెగబడుతోంది. 

 


లావా సంస్థ సీఎండీ హరి ఓం రాయ్ త‌మ విధానాల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇకపై భారత్‌లోనే మొబైల్‌ ఫోన్ల అభివృద్ధి, తయారీ ఉంటుందని స్పష్టం చేశారు. ‘చైనాలో మా మొబైల్స్‌ డిజైన్‌ కోసం దాదాపు 600-650 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు ఈ డిజైనింగ్‌ను భారత్‌కే తరలిస్తున్నాం. మార్కెట్‌లో మా డిమాండ్‌కు తగ్గట్లుగా ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తాం’ అన్నారు. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా చైనా నుంచే మా మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు సాగాయని, ఇకపై భారత్‌ నుంచి ఎగుమతులు చేస్తామన్నారు. చైనాకు మొబైల్‌ ఫోన్లను ఎగుమతి చేయాలన్నదే తమ ఆశయమని పేర్కొన్న రాయ్‌.. ఇప్పటికే భారత్‌ నుంచి అక్కడికి మొబైల్‌ చార్జర్లు ఎగుమతి అవుతున్న విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విధాన నిర్ణయాలు ఆకర్షణీయంగా ఉన్నాయని, తెలిపారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు బాగున్నాయని చెప్పారు. 

 

కాగా, కరోనా నేపథ్యంలో చైనా నుంచి భారత్‌కు కనీసం వెయ్యి సంస్థలు వెళ్లిపోతున్నాయన్న అంచనాలతో చైనా కుట్రలకు పాల్పడుతోంది. పొరుగు దేశాల్లో అలజడులు చెలరేగితే తమ దేశం నుంచి ఏ సంస్థా వెళ్లదన్న దురాలోచనతో చైనా ఈ విధంగా వ్యవహరిస్తున్నది. గ‌త కొద్దిరోజులుగా లడఖ్‌, సిక్కిం సరిహద్దుల్లో గత మూడు వారాల నుంచి నెలకొన్న ఉద్రిక్తతలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని విశ్లేష‌కులు పేర్కొన్నారు.  నేపాల్‌, ఇండోనేషియా, వియత్నాం, తైవాన్‌, మలేషియా దేశాల సరిహద్దుల్లోనూ డ్రాగన్‌ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: