కరోనా వైరస్ అమెరికన్ల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్ ఆంక్షలతో ఆర్ధిక వ్యవస్థకుప్పకూలి పోయింది. లక్షలాది మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు. దీంతో అగ్రరాజ్యంలో నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గత వారం రోజుల వ్యవధిలో 30 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

 

అగ్రరాజ్యం అమెరికా కంటికి కనిపించని వైరస్ ఉచ్చులో చిక్కుకొని అల్లాడిపోతోంది. లాక్ డౌన్ తో అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోవడంతో కొన్ని కంపెనీలకు తాళాలు పడగా మరికొన్ని సంస్థలు ఉద్యోగాల్లో భారీగా కోత విధించాయి. అమెరికా ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్దీపన ప్యాకేజీలు నిరుద్యోగులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. దశాబ్దాల కాలంలో ఎప్పుడూ లేని విధంగా అమెరికాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 

 

కరోనా మహమ్మారి అమెరికాలో విలయ తాండవం చేస్తోంది. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల 60 లక్షల మంది  అమెరికన్లు ఉపాధి కోల్పోయారు. వీళ్లతో పాటు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గ్రూప్స్‌ కింద ఉపాధి పొందుతున్న మరో 8 లక్షల మంది భవిష్యత్తు కూడా గందరగోళంలో పడింది. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోవడం మహా మాంద్యం సమయంలో కూడా లేదంటున్నారు అక్కడి ఆర్ధిక రంగ నిపుణులు. ఆర్ధిక వ్యవస్థను కాపాడేందుకు అమెరికా ప్రభుత్వం మూడు ట్రిలియన్ డాలర్ల ప్యాకేజ్‌ ప్రకటించినా నిరుద్యోగ సమస్య మాత్రం పెరుగుతూనే ఉంది.

 

కరోనా ఆంక్షలను పూర్తిగా సడలిస్తే ఆర్ధిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని ట్రంప్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరోవైపు మరిన్ని ఆర్ధిక ప్యాకేజ్‌లు ప్రకటించే విషయంలో అమెరికన్ కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని ఉద్దీప ప్రకటనలు చేయాలన్న డెమోక్రాట్ల డిమాండ్లను రిపబ్లికన్లు అంగీరకరించలేదు. ఇప్పటి వరకు ప్రకటించిన ప్యాకేజీలు ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేయడానికి ఎలా ఉపయోగపడతాయో చూసిన తర్వాతే.. కొత్త ప్యాకేజ్‌లు ప్రకటించాలని రిపబ్లికన్లు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం.. నిరుద్యోగ సమస్యను.. ఆకలికేకలను అధిగమించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఇంకెన్ని సంస్కరణలు తీసుకువస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: