గత తెలుగుదేశం పార్టీ దేశంలో జరిగిన అవినీతి వ్యవహారాలు ఆషామాషీవి అయితే ఏమి కాదు. వందల, వేల కోట్ల రూపాయల అవినీతికి టిడిపి పెద్దలు పాల్పడ్డారని, అభివృద్ధి పేరు చెప్పి టిడిపి నాయకులు అంతా భారీ ఎత్తున సొమ్ము లు వెనకేసుకుని బాగా లబ్ధి పొందారని టిడిపిపై ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన పాదయాత్ర సమయంలో ఎన్నో అవినీతి వ్యవహారాలకు సంబంధించి టిడిపిపై విమర్శలు చేశారు. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో భూమి కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ చేపడతామని జగన్ ప్రకటించారు. ఆ విధంగానే ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి ప్రభుత్వ హయాంలో నెలకొన్న అనేక అవినీతి వ్యవహారాలపై మంత్రుల కమిటీ వేశారు. ఈ కమిటీ దాదాపు ఐదు వేల ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ నాయకులు రాజధాని ప్రకటనకు ముందే బినామీ పేర్లపై కొన్నారని, మంత్రుల కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. దీనిపై వైసీపీ ప్రభుత్వం  సీఐడీ విచారణ కు కూడా ఆదేశించింది. 


ఈ మేరకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, నారాయణ వంటి వారిపై సీఐడీ కేసు కూడా నమోదు చేసింది. దీనిపై పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం హడావుడి చేసినా, తరువాత ఆ వ్యవహారం పూర్తిగా పక్కన పడిపోయింది. ఇక పోలవరం, పట్టిసీమ విషయాలలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని జగన్ ఆరోపణలు చేశారు. కానీ ఆ వ్యవహారాల్లో టిడిపి నాయకుల పాత్ర బయట పెట్టలేకపోయారు. అలాగే ఈఎస్ఐ స్కాం లో అప్పటి టిడిపి మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ వంటి వారి ప్రమేయం ఉన్నట్లు కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినా, ఇప్పటికీ ఆ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకు రాలేకపోయారు.


 ఇవే కాకుండా చాలా విషయాల్లో టిడిపిని ఇరుకున పెట్టే అవకాశం ఉన్నా, వైసీపీ ప్రభుత్వం ఆ విషయాలపై సీరియస్ గా  దృష్టి పెట్టలేకపోయింది. గత టిడిపి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది వాస్తవం అంటూ పదేపదే వైసిపి నాయకులు చెబుతున్నా, ఏపీలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అప్పటి టిడిపి నాయకుల అవినీతి వ్యవహారాలను బయటపెట్టే విషయంలో ఇంకా సీరియస్ గా దృష్టి పెట్టినట్టు కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: