రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కువగా జాతీయంగా ఏకీకృత విధానాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే ఒకటే దేశం.. ఒకటే ఆధార్.. ఒకటే జిఎస్టి అన్న విధంగానే ఇప్పుడు కొత్తగా మ‌రికొన్ని విధానాలను తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కసరత్తు చేస్తున్నారు. ఇందులో ఒకటి త్వరలోనే విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా ఏకీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా.. లిక్కర్ పాలసీ కూడా ఏకీకృతం చేసే అవకాశం ఉన్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకనుంచి ఏకీకృత విధానంలోనే మద్యం అమ్మకాలు చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు. జాతీయ విధానంతో నాసిర‌కం మ‌ద్యానికి చెక్ పెట్టవచ్చునని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఏకీకృత విధానం అమల్లోకి వస్తే నాణ్యత ప్రమాణాలు ఉన్న‌ బ్రాండ్లను అందుబాటులో ఉంచే అవ‌కాశం ఉంటుంద‌ని, బ్రాండ్ల అమ్మకాల‌‌ నిర్ణయం కేంద్రం పరిధిలోనే ఉంటాయి.

 

ఇదే సమయంలో రాష్ట్రాల ప‌రిధిలో మద్య నిషేధం, నియంత్రణ అంశాలు ఉండే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఏకీకృత విధానం వలన చాలావరకు లాభాలే ఉన్నాయని అంటున్నారు. ఇందులో ప్రధానంగా పక్క రాష్ట్రం నుంచి మద్యం తెచ్చుకున్నా.. ఇబ్బందులు ఉండవని మద్యం ప్రియులు కోరుకున్న బ్రాండ్లను ఎక్కడైనా అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో ఏకీకృత విధానం అమలు చేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే విద్యుత్ పంపిణీ వ్యవస్థల‌ను ఏకీకృతం చేసేందుకు 2003 నాటి విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ముసాయిదా బిల్లును రూపొందించిన విషయం తెలిసిందే. దీనిని తెలంగాణ‌తోపాటు ప‌లు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఎంతో ఆదాయాన్ని తెచ్చే మద్యం అమ్మకాలను కూడా ఏకీకృతం చేసి కేంద్రం పరిధిలోని ఉంచుకుంటే రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవని మరి కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: