ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరిగి దాదాపు అయిదు నెలలు అయింది. డిసెంబర్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ఆ తరువాత మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగాలి. అయితే ఆ సమావేశాలకు కరోనా అడ్డం వచ్చేసింది. దాంతో వాయిదా వేసి గవర్నర్ ద్వారా ఓటాన్  అకౌంట్ మూడు నెలలకు ఆమోదం తీసుకున్నారు.

 

ఇపుడు చూస్తే కరోనా ఉంది. అది తగ్గుముఖం పడుతున్నట్లే ఉంటూ మళ్లీ సత్తా చాటుకుంటోంది. ఈ నేపధ్యంలో జూన్ 30లోగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తీరాలి. ఎందుకంటే  రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లోపల సభ జరగాలి. పైగా బడ్జెట్ తతంగం కూడా అతి ముఖ్యం. దాంతో జూన్లో బడ్జెట్ మీటింగునకు ఏర్పాట్లు చేస్తున్నారుట.

 

బడ్జెట్ సమావేశలు కొన్ని రోజుల పాటు జరిపి ముఖ్యమైన బిల్లులను కూడా పాస్ చేయించుకోవాలని జగన్ సర్కార్ ఆలోచిస్తోంది. ఇదిలా ఉండగా శాసనమండలి ని కూడా పిలుస్తారా అన్నది ఒక చర్చగా ఉంది. ఎందుకంటే మండలి ఇంకా రద్దు కాలేదు. పైగా ఏపీ గవర్నర్  ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతారు. ఆయన కొత్తగా వచ్చారు. రెండు సభల్లో మాట్లాడడం అన్నది కూడా ఆయనకు ఇదే తొలిసారి అవుతుంది.

 

దాంతో మండలి మీద జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ఒక చర్చగా ఉంది. జగన్ మండలిని కూడా పిలిస్తే మాజీ మంత్రులు యనమల రామక్రిష్ణుడు, నారా లోకేష్ కూడా హాజరవుతారు. మరి వారు ముఖం చూడడం జగన్ కి ఇష్టం ఉంటుందా అన్నది మరో ప్రశ్న.

 

మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఆరు నెలలుగా ముఖాముఖాలు చూసుకోని జగన్ బాబు ఎదురెదురు పడతారు. ఇక తెలంగాణాకు పరిమితం అయిన బాబు ఏపీకి  అలా రావడం కూడా  జరుగుతుంది. చూడాలి మరి  అసెంబ్లీ మీట్  ఎలా జరుగుతుందో

 

మరింత సమాచారం తెలుసుకోండి: