మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు మధ్య వివాదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం చెలరేగుతోంది. అంతే కాదు దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా రాజుకుంది. ఏపీ తెలంగాణ మధ్య ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఇసుక వివాదం చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే..? రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలపై అంతర్ రాష్ట్ర సరిహద్దు విషయంలో వివాదం మొదలయ్యింది. దీంతో రెండు రాష్ట్రాల అధికారులు ఈ విషయాన్ని నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఇసుక తవ్వేనందుకు అనుమతి ఇచ్చింది. 

 

IHG


దీని కారణంగా కర్నూలు జిల్లా మైనింగ్ అధికారులు ఇదే జిల్లాలోని శ్రావణబెళగొళ మండలం గుండ్రేవుల వద్ద తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలకు అనువుగా రీచ్ ను ఏర్పాటు చేయడమే కాకుండా ఇసుక తరలించడానికి పెద్ద ఎత్తున వాహనాలు పంపించారు. కానీ ఇటు వైపు తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం చిన్న ధన్వాడ గ్రామస్తులు దీనిపై ఆందోళన చేశారు. తమ గ్రామ పరిధిలోకి వచ్చి మరీ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆందోళనకు సైతం దిగారు. తెలంగాణ సరిహద్దులోకి వచ్చి తీసుక తవ్వకాలు చేస్తున్నారంటూ ఆందోళన చేయడంతో, అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. 

 


దీనిపై ధన్వాడ గ్రామస్తులు తెలంగాణ పోలీస్, మైనింగ్  అధికారులకు ఫిర్యాదు చేయడంతో, తెలంగాణ అధికారులు గుండ్రెవుల రీచ్ వద్ద ఇసుక తవ్వకాల నిమిత్తం వెళ్ళిన వాహనాలను సీజ్ చేశారు. ఆ వాహనాలను తెలంగాణకు తరలించడంతో దీనిపై మరింత ఉద్రిక్తత ఏర్పడింది. ఏపీ అధికారులు ఇదే విషయమై తెలంగాణా అధికారులతో చర్చించినా ఫలితం కనిపించకపోవడంతో రెండు రాష్ట్రాల అధికారులు గుండ్రేవుల రీచ్ ను పరిశీలించారు. దీంతో పాటు ఇరు రాష్ట్రాల సరిహద్దులను గుర్తించేందుకు సర్వే చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: