క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న లాక్‌డౌన్ అమ‌లులో, నిబంధన‌లు పాటించ‌డంలో గ్రామాలే ముందంజ‌లో ఉన్నాయ‌ని, సామాజిక దూరం పాటించ‌డంలో ప‌ల్లె ప్ర‌జ‌లే ఆద‌ర్శంగా నిలుస్తున్నార‌ని స్వ‌యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ చెప్పిన విష‌యం తెలిసిందే. నిజానికి.. క‌రోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న ప‌ట్ట‌ణాల్లోనే లాక్‌డౌన్ నిబంధ‌న‌లు స‌రిగా అమ‌లుకావ‌డం లేదు. ఇష్టారాజ్యంగా రోడ్ల‌మీద‌కు వ‌స్తున్నారు.  సామాజిక దూరం పాటించ‌డం లేదు. కానీ.. గ్రామ ప్ర‌జాప్ర‌తినిధులు, పెద్ద‌ల కృషి వ‌ల్ల లాక్‌డౌన్ నిబంధ‌న‌లు పాటించారు. స‌రే ఇప్పుడంటే కొంత స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో ప‌రిస్థితి మారిపోయింది. అయితే.. తాజా ఘ‌ట‌న ఏమిటంటే.. సామాజిక దూరం పాటించ‌డ‌మే కాదు.. సామాజిక బాధ్య‌త‌ను మ‌రోసారి నిరూపించారు తూర్పుగోదావ‌రి జిల్లా అమలాపురం కొత్తపేట దగ్గర శివారులో బోడిపాలెం మండపల్లి రైతులు. ఇంత‌కీ ఏం జ‌రిగిందో చూద్దాం.. ఈ గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు చెన్నైలోని కోయంబేడు మార్క‌ట్‌కు కంద త‌దిత‌ర కూర‌గాయాల‌ను తీసుకెళ్లారు. అయితే.. చెన్నైలోని కోయంబేడు మార్క‌ట్ కేంద్రంగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా జ‌రుగుతోంద‌ని, అక్క‌డికి వెళ్లివ‌స్తున్న వారిలో చాలామంది వైర‌స్‌బారిన ప‌డుతున్నార‌ని ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెప్పారు.

 

అక్క‌డికి వెళ్లేవారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కూడా సూచించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాట‌ల‌ను విన్న ఆ ముగ్గ‌రు రైతులు కోయంబేడు నుంచి ఈ నెల 10న‌ తిరిగి వ‌చ్చారు. అయితే.. గ్రామానికి మాత్రం రాలేదు.ముగ్గురు రైతులు కొత్తపేట శివాలయం దగ్గర ఉన్నటువంటి ఓ ప్రాంతంలో చిన్న గుడిసె వేసుకుని అక్క‌డే ఉన్నారు. అక్క‌డే ఉండి త‌మ‌కు ప‌రీక్ష‌లు చేయాల‌ని కోరారు. అయినా అధికారులెవ‌రూ స్పందించ‌లేదు.. చివ‌ర‌కు అంద‌రూ చెప్పిన త‌ర్వాత అధికారులు వెళ్లి.. వారికి ప‌రీక్ష‌లు చేశారు. అయితే.. ఇక్క‌డ వారికి నెగెటివ్ వ‌చ్చిందా..?  పాజిటివ్ వ‌చ్చిందా..? అన్న‌ది స‌మ‌స్య‌కాదు.. ఆ ముగ్గురు రైతులు ఎంతో బాధ్య‌త‌గా ఊరికిదూరంగానే ఉండి... త‌మ‌కు ప‌రీక్ష‌లు చేయాల‌ని కోరడం గొప్ప విష‌య‌మ‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. అంద‌రూ వీరిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: