లాక్ డౌన్ వలస కూలీల బతుకులను అతలాకుతలం చేస్తోంది. ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు వెళ్లే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు సుమారుగా దేశవ్యాప్తంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు.  కొందరు ప్రమాదాల్లో చనిపోతుంటే... ఇంకొందరు అనారోగ్యంతో చనిపోతున్నారు. లాక్‌డౌన్‌ తమ జీవితాలను అగమ్యగోచరం చేసిందని వాపోతున్నారు వలస జీవులు. 

 

పాలకుల నిర్ణయాలే కాదు.. విధి కూడా వాళ్ల జీవితాలతో ఆడుకుంటోంది. లాక్‌డౌన్‌ వల్ల ఉపాధిలేక... ఆకలితో అలమటించలేక కాలినడకన  సొంతూళ్లకు బయలుదేరుతున్న వలస కూలీలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఊహించని రీతిలో వాళ్లను మృత్యువు కబళిస్తోంది. 

 

సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న రైళ్లు వలస కార్మికులకు ఎటూ చాలడం లేదు. పైగా ఈ రైళ్లలో రిజర్వేషన్‌ ప్రక్రియ సంక్షిష్టంగా ఉండడంతో నిరక్షరాస్యులైన వలస కార్మికులకు ఇబ్బందికరంగా మారింది. అధికారుల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో కాలిబాటనో.. లారీల్లో కిక్కిరిసిన పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడుతున్నారు. 

 

ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది వలస కూలీలు చనిపోయారు. రాజస్థాన్‌ నుంచి వలస కూలీలతో యూపీకి బయలుదేరిన లారీ... ఔరాయియా వద్ద ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న మరో ట్రక్కును ఢీకొట్టడంతో 21 మంది కూలీలు చనిపోయారు. 

 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మోహనరావు కూలీ పనుల కోసం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలానికి వచ్చాడు. అయితే లాక్‌డౌన్‌ వల్ల పనులు లేకపోవడంతో స్వగ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో.. చంద్రగిరి జాతీయ రహదారిపై వాహనాల కోసం ఎదురు చూస్తూ... ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడం వల్ల మోహనరావు చనిపోయాడంటున్నారు స్థానికులు. 

 

యాదాద్రి భువనగిరి జిల్లా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీ అనారోగ్యంతో చనిపోయాడు. 35 ఏళ్ల దనిరామ్ రాజ్‌పుత్‌ ఉపాధి కోసం ఛత్తీస్‌గఢ్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో వసతి ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. ఇక్కడి నుంచి వలస కార్మికులను రిజర్వేషన్ల వారీగా సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ధనిరామ్ రెండు రోజుల్లో స్వస్థలాలనికి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే అతను అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాడు. 

 

నిజామాబాద్ జిల్లా డిచ్‌ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కేరళ వాసులు మృతి చెందారు. లాక్‌డౌన్‌ కారణంగా బీహార్‌లో చిక్కుకుపోయిన కేరళ వాసులు... నిబంధనలు సడలించడంతో స్కార్పియో వాహనంలో తిరుగుపయనమయ్యారు. మెంట్రాజ్ పల్లి నాకా తండా వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉన్న టిప్పర్‌ను స్కార్పియో ఢీ కొట్టింది. ముగ్గురు మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉన్నాడు. 

 

నిర్మల్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది వలస కూలీలు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఘోరఖ్‌పూర్‌కు వలస కూలీలతో వెళ్తున్న లారీ భాగ్యనగర్‌ రోడ్డులో నీలాయిపేట దగ్గర బోల్తా పడింది. వీరిలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు లారీలో 70 మంది వలస కూలీలు ఉన్నారు. గాయపడ్డ వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: