వదల బొమ్మాలీ.. అంటే చాలు మనకు వెంటనే సోనూ సూద్ గుర్తొస్తాడు. అరుంధతి సినిమాలో విలన్ పాత్ర పోషించిన సోనూ సూద్‌... కళ్లముందు కదలాడతాడు. వెండితెరపై ప్రతినాయకుడి పాత్రలో జీవించిన సోనూ.. నిజజీవితంలో తానో హీరో అనిపించుకుంటున్నాడు.  


 
కరోనా రూపంలో అందరికీ కష్టకాలమొచ్చింది. లాక్‌డౌన్‌లతో జనం ఇబ్బంది పడుతున్నారు. వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కాలినడకన స్వస్థలాలకు బయలుదేరారు. రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల వందల కిలో మీటర్లు నడుస్తున్నారు ఆ నిరుపేదలు. ఇటువంటి వాళ్లకు కొందరు తమ చేతనైనంత వరకూ ఆహారం, మంచినీళ్లు వంటివి అందిస్తున్నారు. కానీ... అవి ఏటూ చాలడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సోనూ సూద్‌ చూపిస్తున్న చొరవ ప్రశంసలందుకుంటోంది. 

 

మహారాష్ట్ర నుంచి సుమారు 350 మంది కార్మికులు కాలినడకన వెళ్తుండడం చూసి చలించిపోయాడు సోనూ సూద్‌. వాళ్లందర్నీ ఒక కేంద్రానికి తరలించి... అక్కడ వాళ్లకు అన్నపానీయాలను అందేలా చూశాడు. వాళ్లందరికీ కరోనా పరీక్షలు చేయించాడు. తర్వాత ప్రభుత్వల అనుమతులు తీసుకుని వాళ్లందర్నీ ప్రత్యేక  బస్సుల్లో  సొంత ప్రాంతాలకు తరలించాడు. అంతేకాదు... బస్సుల దగ్గరకు స్వయంగా వచ్చి వలస కూలీలకు సెండాఫ్‌ ఇచ్చాడు సోనూ సూద్‌. 

 

అక్కడితే ఆగకుండా, ఏపీ, తమిళనాడు, ఒడిశా, యూపిీ బీహార్, జార్కండ్ చెందిన కూలీల ప్రయాణానికి ఏర్పాట్టు చేస్తున్నాడు సోని సూద్. లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహారం అందిస్తున్నాడు సోను. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిసి అంధేరి, జుహు, బాంద్రా ప్రాంతాల్లో ఉన్న  50 వేల మంది పేదలకు రోజూ ఉచితంగా ఆహారం అందిస్తున్నాడు. లాక్‌డౌన్ కొనసాగినన్ని రోజులు పేదలకు భోజనం అందిస్తానని చెబుతున్నాడు.

 

మన కరోనా పోరాటయోధులైన డాక్లర్లకు అండగా నిలబడుతున్నారు సోనూ సూద్. ముంబైలోని ఖరీదైన జుహూ ప్రాంతంలో సోనూకు ఓ హోటల్ ఉంది. 6 అంతస్తుల ఈ హోటల్‌ను పూర్తిగా వైద్యులకు కేటాయించాడు. రోజంతా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఎవరైనా తన హోటల్‌కు వచ్చి ఉచితంగా బస చేయవచ్చని ఆహ్వానిస్తున్నాడు. ఈ మేరకు మున్సిపల్ అధికారులతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలకు సమాచారం అందించాడు సోనూసూద్. మొత్తానికి సిల్వర్‌ స్క్రీన్‌పై విలనిజం పండించి అలరించిన సోనూసూద్‌... నిజజీవితంలో తన హీరోయిజం ప్రదర్శిస్తూ అందర్ని ప్రశంసలు అందుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: