ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. అయితే ఆ యుద్ధం ఆసక్తికరంగా మంత్రులు, మాజీ మంత్రుల మధ్య నడుస్తోంది. ఓ వైపు భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దేవినేని ఉమాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఈ ఇద్దరు నేతలు మాటల తుటాలు పేల్చుకుంటూ, మీసం తీసే సవాల్ వరకు వెళ్లారు.

 

ఇక వీరి మధ్య ఇలా విమర్శల యుద్ధం నడుస్తుండగానే మరో ఇద్దరు నేతల మధ్య వార్ మొదలైంది. అయితే ఆ ఇద్దరు నేతలు మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన వారు. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి కొల్లు రవీంద్రల మధ్య ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంపై రగడ జరుగుతుంది. ఎలాగో నాని రవాణా శాఖ మంత్రి కాబట్టి, కొల్లు ఈ విషయాన్ని గట్టిగా పట్టుకున్నారు.

 

ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వేలాది మందిని తొలగించడం అన్యాయమని, ఉన్నపళంగా పంపించేస్తే వారు ఏ విధంగా బతకాలో ప్రభుత్వమే చెప్పాలన్నారు. సీఎం జగన్, మంత్రి పేర్ని నాని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి, 6 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఇంతకాలం వాడుకున్నారని ఫైర్ అయ్యారు.

 

ఇక మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని వెంటనే కౌంటర్ ఇచ్చేశారు. ఆర్టీసీలో కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించలేదని, కాకపోతే వారికి కరోనా వైరస్ రక్షణ ఇన్సూరెన్స్ లేకపోవటం వలన ఇన్సూరెన్స్ ఉన్న పర్మినెంట్ ఉద్యోగులను ముందుగా విధులకు వాడాలని సర్క్యులర్ జారీ చేశామని క్లారిటీ ఇచ్చారు. ఆ విషయం అర్ధంకాక కొందరు దీన్ని కూడా రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అయితే ఈ మాటల యుద్ధంలో కాస్త అధికార పార్టీ నేతలే పైచేయి సాధిస్తున్నట్లు కనబడుతుంది. టీడీపీ నేతలు చేసే ప్రతి అంశంపై వారు కౌంటర్ ఇచ్చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: