ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈనెల 18 వ తేదీ నుంచి రాష్ర్టంలో విత్తన విక్రయాలను ప్రారంభిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. స‌బ్సిడీలపై విత్తనాలు విక్రయించే కార్యక్రమం చాలా త్వరగానే ప్రారంభమవుతోందని వెల్ల‌డించారు. ఎవరైతే విత్తనాలు కావాలనుకుంటారో....త‌మకు ఇంత పొలం ఉంది....ఈ విత్తనం వేయాలని అనుకుంటున్నాం అని చెబితే వారినుంచి రిజిస్ర్టేషన్ చేయించుకుని వారికి ఏ తేదీన విత్తనాలు అందిస్తారో ఆ రైతులకు తేదీని ఖరారు చేసి చెప్పాలని ముఖ్యమంత్రిగారు ఆదేశించారని, ఆ ప్రకారం ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి క‌న్న‌బాబు తెలిపారు.

 

గత ఐదేళ్ల కాలంలో వ్యవసాయానికి సంబంధించి అస్తవ్యస్థ విధానాలు అమలవుతుండేవని పేర్కొన్న మంత్రి క‌న్న‌బాబు పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ప్రచారం తప్ప వ్యవసాయానికి చంద్రబాబు చేసిందేమి లేదని మండిప‌డ్డారు. ``నేనిప్పుడు ముఖ్యమంత్రిగా ఉండింటే....అని ఈ మధ్య చంద్రబాబు అంటున్నారు. అసలు ఎలా ఉంటావు ముఖ్యమంత్రిగా...23 సీట్లు ఇచ్చారు మీకు, అందులో ముగ్గురు మిమ్మల్ని నమ్మడం లేదు. అసలు జనం తిరస్కరించిన తర్వాత ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఉంటావు?``అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

 

చంద్ర‌బాబు పగటి కలలు కంటున్నారని క‌న్నబాబు వ్యాఖ్యానించారు. ``ఒక పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా మూడుసార్లు చేసి ఇంత చౌకబారుగా, ఎందుకు స్దాయి మరిచి మాట్లాడుతున్నారు.? నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే రైతులకు ఏదో చేసేవాడినని ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఐదేళ్ల కాలంలో తమరు రైతులకు ఏం చేశారు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఏం చేశారో ప్రజలందరికి తెలుసు. రైతులు విద్యుత్ బిల్లులు బకాయిలు ఉంటే 2003 తర్వాత విద్యుత్ చట్టాన్ని తీసుకువచ్చి అరెస్ట్ చేయించి జైలులో తోయించిన ఘనత మీది. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిడదవోలు పక్కన కాల్దారి అనే గ్రామంలో రైతులు ఆందోళన చేస్తుంటే  కాల్పులు జరిపించింది మీరు. బషీర్ బాగ్ లో విద్యుత్ ఉద్యమంలో భాగంగా జరిగిన కాల్పుల సంఘటన అందరికి తెలుసు. రైతుల పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో, రైతుల కోసం మీరు ఏ విధంగా పనిచేశారో అందరికి తెలుసు. ఎవరూ మరచిపోలేదు.`` అని క‌న్న‌బాబు వ్యాఖ్యానించారు. 


``చంద్రబాబు ఈరోజు ఏంమాట్లాడుతున్నారంటే ఆయన ఉండిఉంటే ఇంకా 70 వేల రూపాయలు రైతులకు అదనంగా వచ్చి ఉండేదంట. ఇది పచ్చిఅబధ్దం కదా... మళ్లీ దగాకోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను.2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటంటే రుణమాఫి. అక్కచెల్లెళ్లు.... మీ బంగారం విడిపిస్తానని చెప్పారు. 85 వేల కోట్ల రుణమాఫి చేయాల్సి ఉంటే చేసిందేమో 15 వేల కోట్లు. అంటే రైతాంగానికి 70 వేల కోట్లు ఎగ్గొట్టినట్లు.మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు రైతాంగం 70 వేల కోట్ల మేర నష్టపోయారు చంద్ర‌బాబు`` అని బాబు తీరును దుయ్య‌బ‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: