క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు మిగ‌తా రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శంగా ఉంటున్నాయి. ఇప్ప‌టికే దేశంలోనే అత్య‌ధిక వేగంతో.. అత్య‌ధిక సంఖ్య‌లో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. రోజుకు సుమారు ప‌దివేల‌కు అటు ఇటుగా క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు అధికారులు. అంతేగాకుండా.. అత్యంత వేగంగా ప‌రీక్ష‌లు చేసేందుకు.. ఏపీ ప్ర‌భుత్వం కొవిడ్‌-19 ఏపీ యాప్‌ను కూడా రూపొందించిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌జ‌ల‌కు మంచి అవ‌కాశం క‌లిగింది. ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు వంటి కరోనా వైరస్‌ లక్షణాలుంటే కంగారు పడక్కర్లేదని... ఎక్కడికెళ్లాలి, ఎవర్ని సంప్రదించాలనే దానిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు అధికారులు. ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు నిర్వహించడం ద్వారా కరోనా ఉందో లేదో చెప్పే వినూత్న ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అంటున్నారు.

 

అయితే.. దీనికి చేయాలిందల్లా ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడమే. గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి *కొవిడ్‌–19 ఏపీ* మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని.. అందులో పేరు నమోదు చేసుకుంటే చాలట‌. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వైద్యులు ఇంటి దగ్గరకు వచ్చి పరీక్షలు చేస్తారు. పాజిటివ్‌ వస్తే.. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి హోం ఐసొలేషన్‌లో ఉంచడం లేదా ఆస్పత్రికి తీసుకెళ్లడం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలను ఆక‌ట్టుకుంటోంది. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారికి ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. ఇప్పటివరకు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు 50,000మంది ఉన్నారు. అలాగే.. లక్షణాలున్న గుర్తించి, ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ఈ సేవ‌ల‌పై ప్ర‌జ‌లు కూడా చాలా సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. స్మార్ట్‌ ఫోన్‌లో ‘కొవిడ్‌–19 ఏపీ’ యాప్‌ ఉంటే సరిపోతుంది. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే సందర్భంలో సంబంధిత వ్యక్తి పేరు, ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయనే దానికి చెప్పాలి.

 

యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోగానే సదరు వ్యక్తి ఫోన్‌ నంబర్‌ వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పరిశీలనలోకి వెళ్తుంది. సంబంధిత వ్యక్తికి గల లక్షణాలను బట్టి  ఏఎన్‌ఎం లేదా మెడికల్‌ ఆఫీసర్‌ ఇంటి వద్దకే వస్తారు. లక్షణాలను పరిశీలించిన తర్వాత కరోనా పరీక్షలు అవసరమో లేదో నిర్ధారించి అవసరమైతే అక్కడే చేస్తారు.  నిర్ధారణ అనంతరం ఫలితాన్ని కూడా ఆ మొబైల్‌కే పంపిస్తారు. యాప్‌లో మన ఇంటికి సమీపంలో ఉండే నర్సులు, డాక్టర్ల వివరాలు అందుబాటులో ఉంటాయి. యాప్‌లో మనం ఇచ్చిన సమాచారం మేరకు ఆరోగ్య శాఖ మన ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటుంది. టెస్టులు అవసరం లేదనుకుంటే వ్యాధి తీవ్రతను బట్టి మందులు సూచిస్తారు. ఇప్పుడు ఈ విధానాన్ని మిగ‌తా రాష్ట్రాలు కూడా పాటించాల‌ని చూస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: