క‌ర‌నా వైర‌స్‌‌ హాలీవుడ్‌లో అల్ల‌క‌ల్లోలం రేపుతోంది. ఏడాదికి దాదాపు 9 లక్షల కోట్లు దాని టర్నోవర్ ఉన్న హాలీవుడ్‌ను కోలుకోలేని దెబ్బ‌కొడుతోంది‌. 120 సంవత్సరాల ఘన చరిత్రలో గ‌తంలో ఎన్న‌డూ ఎరుగ‌ని విప‌త్కర ప‌రిస్థితుల‌ను హాలీవుడ్ నేడు ఎదుర్కొంటోంది. ఇప్పటికే అది కరోనా వల్ల 9 బిలియన్ల డాలర్లను నష్టపోయిందని ఒక అంచనా. నిజానికి చిన్న అవాంతరాలకే కుప్పకూలే వ్యవస్థ ఇది. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు 57 వేల మంది హాలీవుడ్‌ కార్మికులు ఉపాధి కోల్పోయారు.  ఈ సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు సుమారు రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. మ‌ళ్లీ ఇప్పుడు క‌రోనాతో ఆందోళ‌న‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి.  హాలీవుడ్‌ని ‘డ్రీమ్‌ ఫ్యాక్టరీ’ అని కూడా అంటారు కొంద‌రు. కరోనా దెబ్బకు ఆ కలల వ్యాపారం నిలువునా కుప్పకూలి పోయింది. నిజానికి.. హాలీవుడ్‌లో పని చేసే వారందరూ ధనవంతులు కారు. హాలీవుడ్‌ మీద ఆధారపడి దాదాపు 9 లక్షల మంది పని చేస్తున్నారు.

 

వీరిలో సుమారు రెండు లక్షల మంది మాత్రమే బాగా గడిచే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు. మిగిలినవాళ్లంతా రెక్కాడితేగాని డొక్కాడని వారే. వీళ్లలో చాలామంది కరోనా వైరస్‌ వల్ల ఉపాధి కోల్పోయారు. డిస్నీలాండ్‌ తన పార్క్‌లో పని చేసే లక్ష మంది ఉద్యోగాలని తొలగించింది. అలాగే థియేటర్లలో పని చేసే వాళ్లల్లో లక్షా యాభై వేల మందిని తీసేశారు. వాళ్లని పనిలో నుంచి తీసేస్తున్న యజమానులు ఇందుకు వేదన అనుభవిస్తున్నారు.  జూన్, జూలై నుంచి సినిమా కార్యకలాపాలు ప్రారంభమైనా ఇంతమందికి ఉపాధి కల్పించడం కష్టం కావచ్చున‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ‘ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం’ అని సినిమాటోగ్రాఫర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ‘కేవలం డోమినోలో మాత్రం ఉద్యోగాలున్నాయి. అక్కడ పని వెతుక్కుంటున్నాం’ అని ప్రొడక్షన్‌ కో ఆర్డినేటర్లు అంటున్నారు. ‘కింగ్‌డమ్‌’ సీరియల్‌లో పాపులర్‌ అయిన నటుడు మాక్‌ బ్రిండెట్‌ తన రెగ్యులర్‌ ఈఎంఐలు కట్టలేక నిరుద్యోగ భృతికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడంటే ప‌రిస్థితులు ఎంతదారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చున‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఎన్నాళ్లు ప‌డుతుందో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: