ప్రస్తుతం భారతదేశంలో వలస కార్మికుల అంశం ప్రతి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లి ఏదో ఒక పని చేసుకుంటూ  జీవనం సాగిస్తున్న వలస కూలీల కు కరోనా  వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్  విధించడంతో 40 రోజుల పాటు ఎలాంటి పనులు లేకపోవడంతో వలస కార్మికుల జీవితం స్తంభించిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి లో ఉండే వలస కార్మికుల జీవితం  దుర్భరంగా మారిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేక.. ఇంటికి వెళ్దాం అంటే ఎలాంటి రవాణా సౌకర్యం లేక... ఓ వైపు బతుకు భారమై... మరోవైపు ఇంటి పయణం ఎంతోదూర మై వలస కార్మికులు అల్లాడిన తీరు ఎన్నో చిత్రాలు కళ్లకు కట్టిన విషయం తెలిసిందే. 

 

 

 ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపించేందుకు రైల్వే మార్గాలు ఉపయోగిస్తూ ఎప్పటికప్పుడు వలస కార్మికులు పంపిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని... వలస కార్మికుల తరలింపు ప్రక్రియను కూడా తూతూ మంత్రంగా చేపడుతుంది అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. 

 

 

 ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కీలక నేత అయిన రాహుల్ గాంధీ అధికార బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా రాహుల్ విమర్శలు పై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస కార్మికుల విషయంలో రాజకీయాలు చేయడం సరైనది కాదు అంటూ నిర్మల సీతారామన్ తెలిపారు. తరలింపు వ్యవహారం పై ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సింది  పోయి... ఈ సమయంలో కూడా రాజకీయ విమర్శలకు కాలు దువ్వుతున్నారు అంటూ మండిపడ్డారు. రాహుల్ ఇప్పటికైనా నాటకాలు మానుకుంటే బాగుంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మల సీతారామన్. ఇక కార్మికుల విషయంలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సోనియాను రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను అంటూ నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: