చంద్రబాబు ఇప్పటికి 31 ఏళ్ళుగా చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. ఆయన తొలిసారి చంద్రగిరి నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఆయన 1983లో టీడీపీ మీద పోటీ చేసిన ఒక సాధారణ మనిషి చేతిలో కాంగ్రెస్ మంత్రిగా ఓడిపోయారు. ఆ తరువాత 1985లో పోటీ చేయలేదు. ఇక 1989 ఎన్నికల్లో ఆయన కుప్పం నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రతిపక్ష నేత అయ్యారు. ఆ తరువాత 1994లో అదే సీటు నుంచి పోటీ చేసి ఎన్టీయార్ ప్రభుత్వంలో మంత్రిగా, ఆ తరువాత ఆయన్నే తప్పించి ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు.

 

ఇలా నాటి నుంచి వరసగా బాబు 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేస్తూ వరస విజయాలు అందుకుంటున్నారు. అయితే బాబుకు కుప్పంతో బంధం నెమ్మదిగా తగ్గిపోతోంది. బాబుకు గత రెండు ఎన్నికల నుంచి మెజారిటీ బాగా పడిపోతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ జగన్ ప్రభంజంలో ఆయన మెజారిటీ ఏకంగా  ముప్పయి వేల‌కు తగ్గిపోయింది.

 

ఇపుడు చూసుకుంటే అక్కడకు బాబు తక్కువ వెళ్తున్నారు. పైగా చిత్తూరు జిల్లా మొత్తం మీద టీడీపీ గెలిచిన సీటు అదొక్కటే. రాజకీయ బలం తగ్గిపోతోంది. మరో వైపు చూసుకుంటే రాయలసీమలో సాగునీటి పధకలను జగన్ విజయవంతంగా  ముందుకు తీసుకువెళ్తున్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పధకానికి జగన్ ఏడువేల కోట్లు మంజూరు చేశారు.

 


దీని మీద తెలంగాణా గరం గరం అవుతోంది. అయితే జగన్ మాత్రం తగ్గలేదు. ఇవన్నీ ఇలా ఉంటే వరద నీటిని ఒడిసిపట్టడానికే ఈ ఎత్తు పెంచడం అని జగన్ అంటున్నారు. వరదనీరు సముద్రంలో వ్రుధాగా కలసిపోకుండా చేయడానికేనని అంటున్నారు. ఇలా అటువైపు, ఇటు వైపు రచ్చ జరుగుతూంటే చంద్రబాబు మాత్రం పోతిరెడ్డిపాడు గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పట్ల  సీమ జిల్లాల్లోనే  చర్చ సాగుతోంది. 

 

ప్రధానంగా రాయలసీమ బిడ్డ అయి ఉండి బాబు తన ప్రాంతానికి సాగు, తాగు నీరు కోరుకోవడం లేదా అన్న ప్రశ్న వస్తోంది. ఇక బాబుకు నిన్నటి ఎన్నికల్లోనే  ఓటమి అంచునకు తీసుకెళ్ళిన కుప్పం ప్రజలు ఈసారి ఆయన్ని క్షమిస్తారా. ఈసారి బాబుని ఓటమి పాలు చేసేందుకు కూడా వైసీపీ రంగం సిధ్ధం చేస్తున్న వేళ కనీసం పోతిరెడ్డిపాడు గురించి  మాట్లాడకుండా బాబు ఉండడాన్ని టీడీపీ తమ్ముళ్లే తప్పుపడుతున్నారు. రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు జగన్ కి మద్దతుగా పోతిరెడ్దిపాడు ఎత్తు పెంపుని సమర్ధిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: