కరోనాతో తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దులు క్లోజయ్యాయి.   ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే జిల్లా స్థాయి అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటోంది. తమ అవసరాలను జిల్లా అధికారులకు వివరించి, వాళ్లిచ్చిన పాసులతో ప్రయాణిస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణ, ఎమర్జెన్సీ అనే రెండు రకాల పాసులు జారీ చేయడమే దీనికి కారణం.

 

తెలంగాణ నుంచి ఉత్తరాంధ్రకు వెళ్లే వాళ్లు సరిహద్దు ప్రాంతమైన జగ్గయ్యపేట మీదుగా ప్రయాణించి గరికపాడ్‌ చెక్‌పోస్టుకు చేరుకుంటున్నారు. ఇక్కడ... వాహనాలను ఆపుతున్న అధికారులు... ఎమర్జెన్సీ పాసులున్న వాళ్లను మాత్రమే అనుమతిస్తున్నారు. సాధారణ పాసులతో వచ్చే వాళ్లకు చుక్కెదురవుతోంది. ఏపీలో పలు ప్రాంతాలకు వెళ్తున్న వాళ్ల దగ్గర పాసులు ఉంటున్నాయి. కానీ అవి కూడా జిల్లా స్థాయి అధికారులు జారీ చేసినవే. కాకపోతే అవి సాధారణ పాసులు. సాధారణ పాసులతో కొందరు ఎమర్జెన్సీ అంటూ వస్తున్నారు. ఇటువంటి వాళ్లను విచారించి, నిజమని తేలితే ఆయా వాహనాలను ఏపీలోకి అనుమతిస్తున్నారు అధికారులు. మిగతా పాసులున్న వాళ్లతో పాటు... పాసులు లేని వాళ్లను వెనక్కి పంపుతున్నారు. 

 

గరికపాడు‌ చెక్‌పోస్టు వద్ద స్పంద‌న ఆన్ లైన్ రిజిస్ట్రేష‌న్ కౌంట‌ర్ ను ఏర్పాటు చేశారు. పాసుల‌తో వ‌చ్చిన ప్రతి ఒక్కరూ స్పంద‌న సెంట‌రులో తమ పేర్లను రిజస్టర్‌ చేయించుకోవాలి. వీళ్లకు వైద్య బృందం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి క్లీన్ చిట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత హోం క్వారంటైన్ అంగీకరించే వాళ్లనే ముందుకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు అధికారులు. ఎలాంటి పాసులు లేకుండా అత్యవసరం కనుక వచ్చామంటున్న వాళ్లకు కౌన్సిలింగ్‌ ఇచ్చి వెనక్కి పంపుతున్నారు. 

 

ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్లే వాళ్లకు డీజీపీ పాసు లేదా జిల్లా ఎస్పీ పాసు ఉంటే సరిపోతుంది. కనీసం రెవిన్యూ అధికారులు జారీ చేసిన పాసులు ఉన్నా వివ‌రాలు నమోదు చేసుకుని, చేతిపై హోం క్వారంటైన్ స్టాంప్‌ వేసి పంపిస్తున్నారు. పాసులు లేకుండా వచ్చే వాళ్లను మాత్రం వెనక్కి పంపేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: