ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోన్న కరోనా మహమ్మారిపై ప్రకాశం జిల్లా విజయకేతనం ఎగురవేసింది. ఇప్పటి వరకు ఆ వైరస్‌ కాటుకు బలై ట్రీట్ మెంట్ తీసుకున్న వారంతా ఇపుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కొత్తగా కేసులు ఏమీ అక్కడ నమోదు కాకపోవడంతో కరోనా ఫ్రీ జిల్లాగా మారిపోయింది. ప్రకాశం జిల్లాలో మొత్తం 63 మందికి కరోనా వైరస్ సోకగా.. వారందరూ కోలుకున్నారు. దీంతో జిల్లాలో యాక్టివ్ కేసులు లేకుండా పోయాయి. కరోనా రాకాసి బారి నుంచి బయట పడడంతో.. జిల్లావాసులు ఉపశమనం పొందుతున్నారు. 

 

ప్రకాశం జిల్లాను భయపెట్టిన కరోనా వైరస్ తోకముడిచింది.  జిల్లాలో ఇప్పటి వరకూ 63 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో నలుగురు తప్ప మిగిలిన వారంతా నిజాముద్దీన్ లింకుల ద్వారా కరోనా సోకినవారే. జిల్లా కేంద్రమైన ఒంగోలులో అత్యధికంగా 35 మందికి కరోనా  సోకింది. ఒంగోలుతో పాటు చీరాల, కారంచేడు మండలం కుంకులమర్రులో ఒక్కో ఇంటిలో రెండు నుంచి ఐదు కేసులు నమోదయ్యాయి.. కందుకూరు, సంతనూతలపాడు, మర్కాపురం, అద్దంకి నియోజక వర్గాల్లో కరోనా కేసులు వెలుగు చూశాయి. జిల్లాలోని సగం నియోజక వర్గాల్లో పాజిటివ్ కేసులు  నమోదు కావడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు, వైద్యులు  సమన్వయంతో పని చేయడంతో.. కరోనా వైరస్ కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు.

 

కరోనా నిర్థారణ కోసం ఒంగోలు  రిమ్స్ హాస్పటల్ లోనే ల్యాబ్ ని ఏర్పాటు చేశారు. పదిహేను రోజులుగా ఇక్కడే  పరీక్షలు  నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఇతరులకు వైరస్ సోకకుండా ప్రత్యేకంగా తయారు చేసిన డ్రోన్, బ్లోయర్ మిషన్లతో పాటు ట్రాక్టర్లతో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నారు. 

 

కరోనా బాధితులందరూ కోలుకుని డిశ్చార్జ్ కావడంతో జిల్లాలో టెన్షన్ తగ్గింది. గతంలో కరోనా పాజిటీవ్ కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు. కరోనా భారి నుంచి, అందరూ కోలుకోవడంతో అధికారులు రెడ్ జోన్ ప్రాంతాల్లో ఆంక్షలు సడలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: