జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మధ్య వరుస పెట్టి జిల్లాలకు చెందిన తమ పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పార్టీ పరిస్థితులని, స్థానిక పరిస్థితులని అడిగి తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్దగా రాజకీయ విమర్శలకు వెళ్లకుండానే జగన్ ప్రభుత్వానికి చురకలు అంటిస్తూ వస్తున్నారు. ఇక తాజాగా కూడా ఉత్తరాంధ్ర జనసేన నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్...కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న జల వనరులను సద్వినియోగం చేసుకుంటే ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెబుతూనే...ఉత్తరాంధ్ర నాయకుల ఆస్తులు అభివృద్ధి చెందుతున్నాయి కానీ.. ప్రజలు అభివృద్ధి చెందడం లేదని మాట్లాడారు. పైగా జనసేన నాయకులకు వ్యాపార బంధాలు లేవు కాబట్టే ప్రజల కోసం గొంతెత్తి మాట్లాడగలుగుతున్నామని అంటూ తమని తాము పైకి లేపుకునే ప్రయత్నం చేశారు.

 

అయితే ఇక్కడ పవన్ చేసిన వ్యాఖ్యల్లో ఉత్తరాంధ్ర నేతల ఆస్తులు అభివృద్ధి చెందుతున్నాయి కానీ, ప్రజలు అభివృద్ది చెందడం లేదనే వ్యాఖ్య కాస్త సమర్ధనీయంగానే కనిపిస్తున్నా..జనసేన నేతలకు వ్యాపారాలు లేవు కాబట్టి ప్రజల కోసం గొంతెత్తి మాట్లాడుతున్నారనే దానిలో ఎలాంటి అర్ధంలేదని అనిపిస్తుంది. ఎందుకంటే జనసేన నేతల్లో చాలామంది వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఆ విషయం ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టంగా తెలుస్తోంది.

 

పైగా జనసేనలో వైసీపీ, టీడీపీల నుంచి వెళ్ళిన నాయకులే ఎక్కువ ఉన్నారు. వారిలో వ్యాపారులు కూడా ఉన్నారు. ఎంపీ అభ్యర్ధులుగా పోటీ చేసిన వారు ఎక్కువ శాతం వ్యాపారులే. ఆఖరికి కూడా పవన్ కూడా ఓ బిజినెస్‌మెన్ అనే విషయం కూడా తెలిసిందే. ఆయన సినిమాల్లో హీరోగా చేస్తూనే, కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కాబట్టి జనసేన నేతలకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని చెప్పడం విచిత్రంగా ఉంది. వేరే పార్టీల నేతలు, వ్యాపారస్తులకు జనసేనలో చోటు కల్పించకుండా ఉంటే పవన్ చెప్పిన మాటకు ఓ అర్ధముండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: