ఏపీలో ప్రస్తుత భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాల మధ్య మాటల యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వీరు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. తాము పోలవరం నిర్మాణం 70 శాతం పూర్తి చేశామని ఉమా చెబుతుంటే, 70 శాతం చేయలేదని, 30 శాతం మాత్రం చేశారని పోలవరం ఓ భాగంలో మాత్రమే 70 శాతం చేశారని అనిల్ అంటున్నారు.

 

మధ్యలో దీనిపై మీసం తీసే సవాల్ కూడా జరిగింది. అయితే వీరి చెప్పే దానిలో ఏదో నిజమో, ఎవరు మీసం తీసుకుంటారో అర్ధంకాక జనం జుట్టు పీక్కుంటున్నారు. సరే జనానికి ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ ఈ ఇద్దరు నేతలు మాత్రం మాటల యుద్ధం చేసుకోవడంలో ఎవ్వరూ తగ్గడం లేదు.

 

తాజాగా కూడా మంత్రి అనిల్ బూతులు మాట్లాడుతున్నారని, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎంత పూర్తి అయిందనే దానిపై కొన్ని లాజిక్‌లు, ఆధారాలు చూపిస్తూ ఉమా సవాల్ గెలవాలని చూస్తున్నారు. పోలవరం పనులు 71 శాతం జరిగాయని గత జూన్‌లో ఇరిగేషన్‌ మంత్రి చెప్పారని, పోలవరం 69శాతం పూర్తయిందని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి ప్రకటించారని దేవినేని చెబుతున్నారు. ఇక్కడ ఉమానే రెండు రకాల స్టేట్‌మెంట్స్ చెప్పారు.

 

ఇక ఉమా మాటలకు అనిల్ మళ్ళీ కౌంటర్ ఇచ్చేశారు. దేవినేనికి బుద్ధి లేదని, తాను బూతులు మాట్లాడుతున్నానని అంటున్నారని, బుర్ర తక్కువ, నెల తక్కువ అంటే బూతులు కాదని కౌంటర్ ఇచ్చారు.  అటు పోతిరెడ్డిపాడుపై ఇంత జరుగుతున్నా టీడీపీ వైఖరేంటో చెప్పడంలేదని, పేదల దగ్గర కమీషన్లు రావనే పోలవరం నిర్వాసితులకు ఇళ్లు కట్టివ్వలేదని విమర్శించారు. అయితే ఇక్కడ కూడా అనిల్ పోలవరం నిర్మాణంలో ఎంత శాతం పూర్తయ్యిందనే విషయం వదిలేసి, పోతిరెడ్డిపాడు, పోలవరం నిర్వాసితులని తీసుకొచ్చి ఉమాని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే వీరి మాటల యుద్ధానికి ఇప్పటిలో ఎండ్ కార్డ్ పడేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: