జగన్ ఇపుడు పాలన మీద ద్రుష్టి పెడుతున్నారు. దానితో పాటే రాజకీయాల మీద చూపు సారించారు. తెలుగుదేశం

అయిన దానికీ కానిదానికీ చేస్తున్న అల్లరితో అధికార పార్టీ విసిగిపోతోంది. పైగా అనేక పనులకు బ్రేకులేస్తూ టీడీపీ అభిమానులు న్యాయపరంగా అడ్డుకుంటున్నారు. దీంతో ఎలాగైనా గట్టిగానే టీడీపీకి రిటార్ట్ ఇవ్వాలని వైసీపీ ఆలోచన చేస్తోందిట.

 

అదేంటి అంటే పాతిక లక్షల‌ మంది పేదలకు ఒకే దఫాలో జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వడం. అదే కనుక చేస్తే ఏపీలో టీడీపీ మటుమాయం అవడం  ఖాయమని అంటున్నారు. ప్రతీ పట్టాతో కనీసంగా నలుగురు కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారు. అంటే ఆ విధంగా కోటి మంది దాకా జనానికి జగన్ ఒక్కసారిగా ఆరాధ్యుడైపోతారు. ఇప్పటివరకూ జగన్ ప్రకటించిన స్కీములన్నింటి కన్నా ఇది చాలా పెద్ద స్కీం.

 

దీని ద్వారా శాశ్వతమైన ప్రయోజనాన్ని జగన్ పేదలకు ఇవ్వబోతున్నారు. పైగా స్థలాలనే కాదు, వారికి ఇళ్ళను కట్టించి ఇస్తారు. దాంతో వారికి పూర్తి స్థాయి  గూడు సమకూరుతుంది. దానికి జగన్ కి ఈ నిరుపేదలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. దీన్ని కనుక చూసుకుంటే ఏపీలోనే  కాదు, దేశంలోనే అతి పెద్ద సంక్షేమ ప్రాజెక్ట్ అవుతుంది.

 

దీంతో ఇపుడు టీడీపీ కంగారు పడుతోంది. జగన్ పేదలకు పట్టాలు పంపిణీ చేయకుండా చూడాలని అనుకుంటోంది. ఇప్పటికి పలుమార్లు ఆగిన పట్టాల పంపిణీకి జూలై 8న అంటే తన తండ్రి వైఎస్సార్  జయంతి వేళ ఇవ్వాలని జగన్ ముహూర్తం పెట్టుకున్నారు. ఇపుడు ఆ పధకం కింద స్థలాలు దొరకనీయకుండా చేసేందుకు ఏ జిల్లాలో జిల్లాలో గొడవలు చేయాలని టీడీపీ అధినాయకత్వం ఆదేశాలు జారిచేసినట్లుగా చెబుతున్నారు.

 

దీంతోనే కాకినాడ మడ అడవుల అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. నిజానికి పట్టాలు ఇస్తున్న ప్రదేశానికి మడ అడవులకు మధ్య పదిహేను కిలోమీటర్ల దూరం ఉంది. అయినా సరే  వైసీపీ సర్కార్ ద్వారా పేదలకు పట్టాలు దక్కరాదని చూస్తున్నారు. అమరావతిలో దళితులకు ఇళ్ల పట్టాలు రాజధాని భూముల్లో ఇద్దామంటే ఆ జీవోను కొట్టేసేలా కోర్టుకెళ్లారని వైసీపీ నేతలు అంటున్నారు.

 

మొత్తం మీద చూసుకుంటే పట్టాల పంపిణీతో టీడీపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారుట. ఇక దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ పట్టాల పంపిణీతో టీడీపీకి పుట్టగతులు ఉండవని అంటున్నారు. అందుకే తమ పార్టీ వారి చేత ఆందోళనలు  చేయిస్తోందని అంటున్నారు. మొత్తానికి పట్టాల యుధ్ధం ఏపీలో హీటెక్కిస్తూ దూకుడుగా  సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: