దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 4,987 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే దాదాపు 5,000 కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న నమోదైన కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 90,927కు చేరింది. 
 
గడచిన 24 గంటల్లో 120 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,872కు చేరింది. 120 మరణాల్లో 67 మరణాలు మహారాష్ట్రలోనే చోటు చేసుకోవడం గమనార్హం. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో 10,000కు పైగా కేసులు నమోదయ్యాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న డిశ్చార్జి అయ్యేవారి సంఖ్య కూడా పెరగడం గమనార్హం. 
 
దేశంలో కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు పట్టే సమయం 13.6 రోజులుగా ఉంది. లాక్ డౌన్ 2 ముగిసే నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 40,263 కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 90,927కు చేరింది. గడచిన 14 రోజుల్లో దేశవ్యాప్తంగా 50,664 కరోనా కేసులు వెలుగు చూశాయి. 1,566 మంది గడచిన 14 రోజుల్లో కరోనా భారీన పడి మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 30,706కు చేరింది. 
 
మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలో గత 24 గంటల్లో 25 మందికి కరోనా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో కరోనా భారీన పడి ఒకరు మృతి చెందడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 50కు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 42 కరోనా కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1551కు చేరింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ సంఖ్యలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: