తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల తరువాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రాష్ట్రంలో రేపటి నుంచి ప్రజా రవాణా సేవలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం నాలుగో విడత మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో బస్సులను నడిపించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే కేబినెట్ భేటీలో ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడంతో పాటు లాక్ డౌన్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చ జరగనుంది. 
 
కేబినెట్ భేటీలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధివిధానాల గురించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో మార్చి నాలుగో వారం నుంచి బస్సులను ప్రభుత్వం నిలిపివేసింది. కానీ తాజాగా కేంద్రం సడలింపులు ఇవ్వడంతో మంగళవారం నుంచి బస్సులు నడపాలని నిన్న రాత్రి ఆర్టీసీ వర్గాలకు సమాచారం ఇచ్చింది. అంతరాష్ట్ర బస్సుల విషయంలో మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. 
 
ఈరోజు రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బస్సుల నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆరెంజ్, గ్రీన్ జోన్ల సంఖ్య పెరగడంతో బస్సులు నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో బస్సులు తిరగనున్నాయి. ఈ సమావేశంలో స్టేడియాలు, సెల్ ఫోన్ షాపులు, సెలూన్ల గురించి కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. 
 
గతంలో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ను మే నెల 29వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటన చేయగా తాజాగా కేంద్రం లాక్ డౌన్ ను మే 31 వరకు పొడిగించడంతో తెలంగాణ సర్కార్ కూడా మే 31 వరకు లేదా జూన్ మొదటివారం వరకు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఈ సంవత్సరం వానాకాలం సీజన్ నుంచే నియంత్రిత సాగు చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికి అనుగుణంగా సీఎం కేసీఆర్ నిపుణులతో చర్చించనున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: