మధ్యప్రదేశ్‌లో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం జ‌రిగింది. గ్వాలియన్ నగరంలో షాప్ కమ్ రెసిడెన్సియల్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగిన ఘ‌ట‌న‌లో ఏకంగా ఏడుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు. రోషినిగఢ్ రోడ్డులోని ఇందేర్‌గంజ్ ప్రాంతంలో ఈ జ‌రిగింది. సోమ‌వారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తొలుత ఓ పెయింట్ షాప్‌లో మంటలు చెలరేగి, చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించినట్టు ఎస్పీ సత్యేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. పెయింట్స్ వల్ల మంటల వేగంగా వ్యాపించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. మంటలు కింది అంతస్థులో మొదలై రెండో అంతస్థులోకి వ్యాపించి, అందులో ఉన్న రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు పేర్కొన్నారు. గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. జగ్‌మోహన్ గోయల్, జైకిషన్ గోయల్, హరిఓమ్ గోయల్ అనే ముగ్గురు అన్నదమ్ములు పెయింటింగ్ షాప్ నడుపుతున్నారని, బాధితులు కూడా వారి కుటుంబాలకు చెందిన వారేన‌ని అధికారులు తెలిపారు.

 

విష‌యం తెలిసిన వెంట‌నే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇక‌ అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలిసిరాలేదని పోలీసులు తెలిపారు. అయితే, కేసు నమోదుచేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌ట్టిన త‌ర్వాతే ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పోలీసులు అంటున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెంద‌డంతో స్థానికంగా విషాద‌ఛాయ‌లు అలుకుముకున్నాయి. స్థానిక ప్ర‌జ‌లు క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్నారు. ఈ దారుణ ఘ‌ట‌న‌తో తీవ్ర భ‌యాందోళ‌నకు గుర‌వుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: