భారత్‌లో వలస కార్మికుల మరణాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ కార‌ణంగా వలస కార్మికులు, కూలీలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. చేతిలో ప‌నిలేక‌.. తినేందుకు తిండిలేక‌, ఉండేందుకు నీడ‌లేక‌.. బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు.  ఈ నేపథ్యంలో వందలు, వేలాది మంది కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు కాలినడకన బయలు దేరుతున్నారు. మరికొందరు ఏవైనా వాహ‌నాలు దొరికితే వాటిలో పోతున్నారు. ఈ క్రమంలో అలసి పోయి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై కొంద‌రు, ప్రమాదాల్లో మరికొందరు మృతి చెందుతున్నారు. దేశంలో ఈ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్నఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన వ‌రుస ప్ర‌మాదాల్లో ఏకంగా 35మంది కార్మికులు దుర్మ‌ర‌ణం చెందారు. తాజాగా  మరో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మ‌రో వ‌ల‌స కార్మికుడు ఇంటిక చేరుకోకుండానే ప్రాణాలు వ‌దిలాడు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.. అతడు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వలసకార్మికుడు.

 

బతుకుదెరువు కోసం గతంలో ముంబై న‌గ‌రానికి వచ్చి లాక్‌డౌన్‌తో అక్క‌డే చిక్కుకున్నాడు. ఎలాగైనా యూపీలోని తన స్వస్థలమైన అజాంగఢ్‌కు చేరుకోవాలని ముగ్గురు కూతుళ్లను వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఈక్ర‌మంలో ట్రక్కు దొరకడంతో తన ముగ్గురు కూతుళ్లతో కలిసి సదరు వలస కార్మికుడు సొంతూరుకు పయనమయ్యాడు. అయితే దురదృష్టవశాత్తు వలసకార్మికుడు మార్గమధ్యలో ట్ర‌క్కులోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ ట్రక్కు  డ్రైవర్ మానవత్వం మరిచిపోయి.. ఆ కార్మికుడి మృతదేహంతోపాటు అతని ముగ్గురు కూతుళ్లును రోడ్డు పక్కనే వదిలిపెట్టిపోయాడు. ఆ ముగ్గురు కూతుళ్లు కూ డా మైన‌ర్లేకావ‌డం గ‌మ‌నార్హం. తండ్రి మృతదేహం ప‌క్క‌న ఉన్న‌ ఆ పిల్ల‌ల‌ను చూసి స్థానికులు క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్నారు. అయ్యో బిడ్డ‌లారా.. అంటూ బోరున‌విల‌పించారు. ట్రక్కు డ్రైవర్‌ వలసకార్మికుడితోపాటు అతని ముగ్గురు కూతుళ్లను మధ్యప్రదేశ్‌ లోని శివ్‌ పురి జిల్లాలోని కరేరా రోడ్డు పక్కనే వదిలిపెట్టివెళ్లాడని కరేరా తహసీల్దార గౌరీ శంకర్‌ బైర్వా తెలిపారు. తండ్రి మృతదేహంతోపాటు ఆ ముగ్గురు కూతుళ్లను స్వస్థలానికి పంపించేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: