డ్రాగన్ దేశం ప్రమాదం నుంచి ఇంకా బయటపడలేదు. కరోనా దెయ్యం వదిలిపోయినట్టే కనిపించి.. మళ్లీ వచ్చేస్తోంది. ఈ సారి దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లక్షలాది మందిని ఆస్పత్రిపాలు చేసిన ఈ మహమ్మారి ముందు రోజుల్లో ఇంకేం చేయబోతుందనే టెన్షన్ వాళ్లలో నెలకొంది. అందుకు ప్రధాన కారణం చైనీయుల్లో ఉండే తక్కువ రోగ నిరోధక శక్తిని ఆసరాగా చేసుకొని చెలరేగిపోతుందని చైనా వాసులు ఆందోళన చెందుతున్నారు.  

 

కరోనాతో అల్లకల్లోలమయిపోయిన చైనాలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆఫీసులు, పార్కులు, మాల్స్‌, థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రజా రవాణా సాధారణ స్థితికి చేరుకుంటోంది. కరోనా నుంచి బయటపడ్డామని అంతా అనుకున్నారు. మహమ్మారి పీడ విరగడైందని సంతోషపడ్డారు. కానీ ఇంతలోనే కొత్త కేసులు వచ్చాయి. నిత్యం పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా పాజిటివ్‌ వచ్చిన వారిలో లక్షణాలు కూడా బయటపడటక పోవడం ఆందోళన కలిగించే విషయం.  

 

కొత్త కేసులు చైనాకు అతిపెద్ద సవాల్‌గా మారనుందని డాక్టర్ జోంగే హెచ్చరిస్తున్నారు. విదేశాలతో పోలిస్తే దీని తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు. ఇందుకు కారణం.. చైనీయుల్లో తక్కువ ఇమ్యూనిటీ ఉండటమేనన్నారు. రెండోసారి ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో అధికారులు ఉదాసీనంగా ఉండకూడదని వార్నింగ్ ఇస్తున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తొలి రోజుల్లో సమాచారాన్ని అధికారులు బయటపెట్టలేదని చెప్పారు. కేసుల తీవ్రతను తక్కువగా చూపించారని చెప్పారు. ప్రస్తుతం చైనా అతిపెద్ద సవాల్‌ ఎదుర్కొంటోందని తెలిపారు జోంగ్‌.

 

2003లో చైనాలో సార్స్‌ మహమ్మారి విజృంభించిన సమయంలో వ్యాధిని ఎదుర్కొనేందుకు డాక్టర్ జోంగ్‌ విశేష కృషి చేశారు. అందుకే ఆయన్ని సార్స్ హీరోగా పిలుచుకుంటారు. కరోనా వైరస్‌ పోరులోనూ చైనా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా మనుషుల మధ్య సంక్రమిస్తుందని తొలిసారిగా ప్రకటించింది డాక్టర్‌ జోంగే.

మరింత సమాచారం తెలుసుకోండి: